»Telangana Secretariat Will Make Changes Bandi Sanjay
New Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ మార్పులు చేస్తాం-బండి సంజయ్
హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టనని ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తెలంగాణకు ఎవరిని సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు
తెలంగాణ (Telangana) కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లబోనని బీజేపీ తెలంగాణ చీఫ్, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. అది సెక్రటేరియట్ (Secretariat) లా కన్పించడం లేదని.. ఓవైసీ(Owaisi) కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంతృప్తి పరచడానికే కట్టినట్టుందన్నారు. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్క్రతికి అనుగుణంగా మార్పులు చేసిన తర్వాతే సచివాలయానికి వెళ్తానన్నారు బండి సంజయ్. నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు కేటాయిస్తే.. మసీదుకు 5 ఎకరాలు ఇస్తారా? తెలంగాణలోని హిందూ సమాజమంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు. కేసీఆర్ పాలనలో హిందువులంతా బాంచన్ బతుకులు బతకాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ సచివాలయాన్ని కూలగొడ్తామని పలు సార్లు బండి సంజయ్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక(Karnataka)లో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. అక్కడ యువత నుంచి బీజేపీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు. బీజేపీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుందన్న భావన కర్నాటక ఓటర్లలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ (Congress party) గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు అని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పిన బండి సంజయ్.. కాంగ్రెస్ వి వృథా ప్రయాసలు అన్నారు. కర్నాటకలో బొట్టు తుడుచుకుంటే అధికారం రాదని, బొట్టు పెట్టుకుంటే వస్తుందని బండి సంజయ్ అన్నారు. ఎవరి సంప్రదాయాలు వారు పాటిస్తారని, దానిని కూడా కొందరు అవమానిస్తున్నారని మండిపడ్డారు.ఓ వర్గం ఓట్ల కోసం సచివాలయ భవనం నిర్మాణ విధానం సాగిందని విమర్శించారు.