మరి కొంత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది నేతలు ఇప్పుడే పార్టీలు మారే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తాజాగా…తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు గంజి చిరంజీవి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గంజి చిరంజీవి వైసీపీలోకి చేరిపోయారు.
మంగళగిరిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు.బలమైన ఆర్ధిక నేపథ్యం ఉండటంతో ఆయన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు వారాల క్రితం తనను పార్టీలో ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆరోపించార. టీడీపీ నేతలతో తాడోపేడో తేల్చుకుంటానని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్కే, గంజి చిరంజీపై కేవలం 12 ఓట్లు మాత్రమే ఆధిక్యం సాధించారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మీద ఆర్కే 5337 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.
నారా లోకేష్‌తో పోలిస్తే గంజి చిరంజీవికి స్థానికంగా పట్టుంది. సామాజిక సమీకరణలతో పాటు, స్థానికుడు కావడంతో ఆయనకు సొంత ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ కోసం గంజి చిరంజీవి స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. 2024కూడా ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడం, పార్టీలో పనిచేస్తున్నా తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.