టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా ఇంకా ఎక్కడోకచోట మూఢనమ్మకాల విశ్వాసం అలానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో దొంగ బాబాలు, నకిలీ మత గురువుల మాయలో పడి ప్రజలు మోసపోతున్నారు. తాజాగా జీసస్ (Jesus)ను కలుసుకోవాలనే కోరికతో ఏకంగా 47 మంది ఆత్మహత్య(47 Died) చేసుకున్నారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. ఓ పాస్టర్ వికృత బోధనల వల్ల అమాయకులు బలైపోయారు. పాస్టర్ మైకంలో పడి ప్రాణాలు విడిచారు. ఆ ప్రాంతంలో తవ్వే కొద్దీ శవాలు(Dead Bodies) బయటపడుతూనే ఉన్నాయి.
కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జీసస్ (Jesus)ను కలవడానికి కఠిన ఉపవాసం చేసి మరణించాలని చర్చి పాస్టర్ మాకెంజీ తెలిపాడు. అతను చెప్పినట్లుగా చేయడంతో 47 మంది ప్రాణాలు విడిచారు. అడవిలో 11 మృతదేహాలను, ఆ ప్రాంతానికి మరికొంత దూరంలో మరో 26 డెడ్ బాడీలను పోలీసులు వెలికితీశారు. మిగిలిన మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటుగా చిన్న పిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. చర్చి పాస్టర్ మాకెంజీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఇప్పటి వరకూ 58 సమాధులను గుర్తించారు. జీసస్ (Jesus)ను కలిసేందుకు ఉపవాసం చేసి మరణించేందుకు 1000 మందికి పైగా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చర్చి పాస్టర్ ను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు.