»Minister Niranjan Reddy Lashes Out At Ponguleti And Jupalli
Minister Niranjan Reddy: పొంగులేటి, జూపల్లి వెనుక ఎవరున్నారో తెలుసు.. ఆంధ్రా పార్టీ మాటలు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు (jupalli krishna rao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు (ponguleti srinivas reddy) ఇద్దరు కూడా పార్టీలో తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారని, కేసీఆర్ ను (chief minister of telangana kcr) విమర్శించి బయటకు వెళ్లిన వారు ఎవరు కూడా రాజకీయాల్లో నిలబడలేకపోయారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (singireddy niranjan reddy) సోమవారం అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్ప అని బీఆర్ఎస్ (brs) భావిస్తోందన్నారు. వారి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పార్టీ లొంగే సమస్య ఉండదని స్పష్టం చేశారు. వారు కోరుకున్నది జరగడం లేని, ఆశించిన పదవులు రావడం లేదని వ్యక్తిగత ధోరణితో ముందుకు సాగుతున్నారని ధ్వజమెత్తారు. చివరకు కేసీఆర్ పైనే విమర్శలు చేసే స్థాయికి వచ్చారన్నారు. పూర్తిగా ఆలోచించిన తర్వాతే వారిద్దరి పైన కేసీఆర్ వేటు (kcr suspends jupally krishna rao, ponguleti srinivas reddy) వేశారని చెప్పారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ తనను విమర్శించిన వారికి కూడా అవకాశాలు కల్పించారన్నారు. పార్టీలో ఉన్న వారిని పోగొట్టుకోవాలని ఎవరూ భావించరని, కానీ కేసీఆర్ ను కూడా వారు టార్గెట్ చేసే స్థాయికి వచ్చారన్నారు.
జూపల్లి పదకొండేళ్ల క్రితం 2012లో తమ పార్టీలో చేరారని, కాంగ్రెస్ ను వదిలి రావడంతో అధికారంలోకి వచ్చాక మంత్రిని చేశారన్నారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు స్వలాభం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆయన మంత్రిగా ఎందుకు చేశారో చెప్పాలన్నారు. జూపల్లితో పాటు పొంగులేటి… వీరిద్దరు ఎవరి ట్రాప్ లో పడ్డారో తమకు తెలుసునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వారి బండారం బయటపడుతుందన్నారు. వారిద్దరి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసీఆర్ వారి విషయంలో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత పైన వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలని నాడు ఉమ్మడి ఏపీలో జూపల్లి మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పలేదా అని నిరంజన్ ప్రశ్నించారు. తెలంగాణలో జూపల్లి మంత్రి అయ్యాక కూడా ఇంట్లో వైయస్ ఫోటో పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే కేసులు పెట్టించి, వైయస్ విగ్రహాలు పెట్టించారని ఆరోపించారు. ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ పార్టీలు పెట్టిన వారి మాటలను పొంగులేటి, జూపల్లి మాట్లాడుతున్నారన్నారు. పాలమూరు కేసీఆర్ హయాంలోనే సస్యశ్యామలం అయిందన్నారు. వైయస్ హయాంలో నీళ్లు వచ్చాయా చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ వచ్చాక పాలమూరుకు నీళ్లు వచ్చాయన్నారు. కొల్లాపూర్ లో జూపల్లి ఓడితే అది కేసీఆర్ తప్పు ఎలా అవుతుందన్నారు. నాలుగున్నర లక్షల కోట్లను ఒక్క వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. అసలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ వంటి పథకాలు ఉన్నాయా అని సవాల్ చేశారు.