»Bandi Sanjay Arrest Two Week Remand To Telangana Party Chief
Bandi Sanjay Arrest: బండి సంజయ్‌కి 2 వారాల రిమాండ్, కరీంనగర్ జైలుకు తరలింపు
బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.
కమలాపూర్ ప్రభుత్వ పాఠశాల (kamalapur government school) నుండి పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ (hindi ssc paper leak) కేసులో అరెస్టయిన బండి సంజయ్ ని (bandi sanjay) పోలీసులు హన్మకొండలోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి అనిత రాపోలు నివాసంలో హాజరు పరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 19వ తేదీ వరకు అంటే రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఈ సందర్భంగా బండి సంజయ్ జడ్జికి తెలిపారు. తన చొక్కాను విప్పి బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు గాయాలను చూపించారు. ఈ కేసులో బండి సంజయ్ ని ఏ1, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ ను ఏ2, గుండబోయిన మహేష్ ను ఏ3, కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్ గా ఉన్న మైనర్ బాలుడిని ఏ4స శివగణేష్ ను ఏ5, పోగు సుభాష్ ను ఏ6, పోగు శశాంక్ ను ఏ7, పెరుమాండ్ల శ్రామిక్ ను ఏ9, దూలం శ్రీకాంత్ ఏ8, పాతబోయిన వర్షిత్ ను ఏ10 నిందితులుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ బెయిల్ రాకుంటే కరీంనగర్ జైలుకు తరలించనున్నారు.
అంతకుముందు వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) మీడియాతో మాట్లాడుతూ టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రశాంత్, మహేష్ ప్రశ్నా పత్రాన్ని బండి సంజయ్ (Bandi Sanjay)కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్ పేపర్ చేరిందన్నారు. ఉదయం తొమ్మిది.. తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభమైందని చెప్పారు. ఏ2 ప్రశాంత్.. ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడన్నారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో సంజయ్ తన దగ్గర ఫోన్ లేదని చెప్పారన్నారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారన్నారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీజేపీ నేతల పైన ముందుగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వచ్చే అరగంట ముందు బండి సంజయ్ కు అది వస్తే ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. పేపర్ లీక్ విషయాన్ని ప్రతిపక్షాలకు చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా జర్నలిస్టులు అలా పంపించి ఉంటారన్నారు. కావాలని బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందని చెబుతున్నారు.