మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం బాధించిందని టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నారు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో (Border-Gavaskar Trophy) భాగంగా భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో(narendra modi stadium, ahmedabad) జరిగిన నాలుగో టెస్ట్ లో కోహ్లీ సెంచరీ (186) పరుగులు చేశాడు. ఈ టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో అప్పటికే 2-1తో ఆస్ట్రేలియా కంటే ముందున్న భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. అనంతరం కోహ్లీతో (Virat Kohli) భారత ప్రధాన కోచ్ (Team India Head Coach) రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) చిట్ చాట్ గా మాట్లాడారు. మూడేళ్ల పాటు టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం కష్టంగా అనిపించిందా అని ద్రావిడ్ అడిగారు. దానికి కోహ్లీ సమాధానం చెప్పారు.
వాస్తవానికి తన సొంత తప్పిదాల వల్లే సెంచరీ చేయలేకపోయానని, నేను చేసిన పొరపాట్లు చాలా కాలం టెస్టుల్లో సెంచరీకి దూరం చేశాయని చెప్పారు. సెంచరీ చేయాలనే తపన ఓ బ్యాట్స్ మెన్ గా మీలో కూడా ఉంటుందనే అనుకుంటున్నానని ద్రావిడ్ ను ఉద్దేశించి అన్నారు. మనమంతా ఇలాంటి పరిస్థితిని ఏదో సందర్భంలో ఎదుర్కొంటామని, నా విషయంలో ఈ ఉత్కంఠ ఎక్కువ కాలం సాగిందని వ్యాఖ్యానించారు. నేను 40 లేదా 45 పరుగులతో సంతృప్తి చెందే వాడిని కాదని చెప్పారు. ఈ మ్యాచ్ సందర్భంగా తాను నలభై పరుగుల వద్ద ఉన్నప్పుడు.. నేను 150 పరుగులు చేస్తే, ఆ రన్స్ జట్టుకు ఉపయోగపడతాయని గుర్తించానని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మంచి ప్రదర్శన చేసినప్పుడు సంతోషపడతానన్నారు.
అయితే మూడేళ్ల పాటు సెంచరీ లేకపోవడం తనను బాధించిందని, కానీ రికార్డ్ ల కోసం తాను ఆడనని స్పష్టం చేశారు. వాటి గురించి అసలు పట్టించుకోనని అన్నారు. జట్టు కోసం వీలైనంత ఎక్కువ సేపు ఆడటం, ఎక్కువ పరుగులు చేయడం, క్లిష్ట సమయాల్లో మంచి ప్రదర్శన చేయడం తన లక్ష్యం అన్నారు. హోటల్ బాయ్ నుండి బస్సు డ్రైవర్, లిఫ్ట్ లోని వ్యక్తి వరకు తనను సెంచరీ కావాలని అడిగారని గుర్తు చేసుకున్నారు.