ప్రజల సెల్ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించాలని సిద్ధమవుతోంది వైసీపీ ప్రభుత్వం. మార్చి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు 5.65 లక్షలమంది వైసీపీ సమన్వయకర్తలు, గృహసారథులు ఇందులో పాల్గొంటారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటింటికి జగన్ స్టిక్కర్ (YS Jagan) అతికిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నరకు పైగా ఇళ్ల తలుపులకు మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు అంటించారు. ఇప్పుడు మరో కార్యక్రమంతో ముందుకు సాగాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల సెల్ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించాలని సిద్ధమవుతోంది. మార్చి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు 5.65 లక్షలమంది వైసీపీ సమన్వయకర్తలు, గృహసారథులు ఇందులో పాల్గొంటారు. సెల్ ఫోన్ (Cell Phone) వెనుక భాగంలో అంటించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చిన్న సైజ్ స్టిక్కర్లు అంటించనున్నారు. ఏపీలో 90 శాతానికి పైగా అంటే 5 లక్షలమంది గృహసారథుల నియామకం పూర్తయిందని, మిగిలిన వారిని ఈ నెల 16వ తేదీలోగా నియమించాలని సోమవారం క్యాంపు కార్యాలంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 5.65 లక్షలమంది వైసీపీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతారు. వీరితో పార్టీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
ఇప్పటికే చాలామందికి శిక్షణ ఇవ్వగా, మిగిలిన వారిని ఎంపిక చేయడంతో పాటు మరో నాలుగైదు రోజుల్లో శిక్షణ పూర్తి చేస్తారు. వీరంతా మార్చి 18వ తేదీ నుండి ఇంటింటికి తిరిగి 2014 నుండి 2019 వరకు టీడీపీ పాలనలోని వైఫల్యాలు, అలాగే, వారు నెరవేర్చని హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్తారు. అలాగే, 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చేసారు, హామీలను ఎంత వరకు నెరవేర్చారు… అలాగే, ఆయా నియోజకవర్గాల్లోని హామీలు ఏ మేరకు పూర్తయ్యాయి… అనే వివిధ అంశాలను శిక్షణ అనంతరం వారు ప్రజల్లోకి తీసుకు వెళ్తారు. అలాగే, టీడీపీకి భిన్నంగా వైసీపీ ఏం చేసిందనే అంశాన్ని కూడా వివరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రచార పత్రాలు కూడా ఇస్తారు. ప్రభుత్వం నుండి ఇంకా ఏం కోరుకుంటున్నారనే సమాచారాన్ని కూడా సేకరిస్తారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు తెలియజేసేందుకు 5 అంశాలతో కూడిన ఒక పత్రాన్ని భర్తీ చేయించుకుంటారు. ప్రజలకు ఇబ్బందిగా అనిపించకుంటే మాత్రమే సంతకాలు తీసుకుంటారు. అలాగే, జగన్ ప్రభుత్వంపై నమ్మకం ఉంటే మిస్డ్ కాల్ ఇవ్వండి అని ఓ నెంబర్ ఇస్తారు. ఇలా ఎన్నికలకు మరో ఏడాది మీద నాలుగు నెలలు ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
కాగా, గృహసారథుల నియామకంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ పలువురు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గడప గడపకు కార్యక్రమంలో కొందరు మంత్రులు సహా ఇరవై మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, రోజుకు కనీసం రెండు గంటలు కూడా పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలిచే దిశగా ఎమ్మెల్యేలు అందరూ రెండు నెలల పాటు ప్రజల్లోనే తిరగాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా పదిహేను పదహారు నెలల సమయం ఉందని, ఆషామాషీగా తీసుకోవద్దన్నారు.