నెల్లూరు పాలిటిక్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. నిన్న కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇద్దరు గన్ మెన్లను రీ కాల్ చేసింది. దీంతో కోటంరెడ్డి ఈ రోజు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నలుగురిలో ఇద్దరు గన్ మెన్లను వెనక్కి తీసుకోవడం ఏంటీ అని మండిపడ్డారు. దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం అనుకుంటుందని కోటంరెడ్డి చెప్పారు. గన్ మెన్ల తొలగింపు అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వానికి రిటర్న్ గిప్ట్ ఇస్తున్నానని ప్రకటించారు. ఆ ఇద్దరు గన్ మెన్లను కూడా తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పారు. తనది ప్రజల గొంతుక అని.. స్వరం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదన్నారు. భద్రత తీసివేసినంత మాత్రానా బలహీనుడిని కానని తేల్చిచెప్పారు. ప్రజల పక్షాన నిలబడుతానని కోటంరెడ్డి స్పష్టంచేశారు.
వైసీపీకి 175 సీట్లు గెలుస్తామని ధీమా ఉంటే.. 15 మంది మంత్రులు, సలహాదారులు ఒక్క ఎమ్మెల్యేపై ఎందుకు దృష్టిసారించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగారు. తనపై కక్ష సాధించేందుకు రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు సహా ఇంతమంది పనిచేయడం అవసరమా? అని ప్రశ్నించారు. తన వెంట ఉన్నవారిని పని గట్టుకొని కలువడం, దూరం చేయడం ఎందుకు అని నిలదీశారు.
ఎఎస్పీపై కోటంరెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు 1 ప్లస్ 1 గన్ మెన్లు అని ఎఎస్పీ స్టేట్ మెంట్ ఇవ్వడం సరికాదన్నారు. ఎందుకు ఇలా అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఏదైనా సరే తాను సిద్దమేనని మరోసారి స్పష్టంచేశారు. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని భావొద్వేగంతో చెప్పారు. నెల్లూరు రూరల్ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా చేస్తానని తెలిపారు.