Assam Floods : భారతదేశంలో ఒకవైపు వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు కుండపోత వర్షాలు జనాలని ఇబ్బంది పెడుతున్నాయి. అసోంలో కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాంలో వాతావరణం సాధారణంగా లేదు. మే 28 నుండి వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలోని 15 జిల్లాల్లో 1.6 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. అలాగే వరదల కారణంగా ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు.
అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) వరద నివేదిక ప్రకారం.. మంగళవారం హైలకండి జిల్లాలో వరదల కారణంగా నీటిలో మునిగి ఒకరు మరణించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 26 మంది మరణించారు. వరదల కారణంగా రాష్ట్రంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పంట పొలాలు నీట మునిగాయి. ప్రజల ఇళ్లు నీట మునిగాయి. దీంతో రాష్ట్రంలో ఆహార పదార్థాల కొరత ఏర్పడి ప్రజలు షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకోవాల్సి వస్తోంది.
మరోవైపు, అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటివరకు 1.52 లక్షల మంది వరదల బారిన పడ్డారు. 41,711 మంది పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. 225 గ్రామాల్లోనూ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజల ఇళ్లు నీట మునిగాయి. తినడానికి తిండి కూడా లేదు. ఆ తర్వాత దాదాపు 22 వేల మంది శిబిరంలో తలదాచుకున్నారు. 1378.64 హెక్టార్ల వ్యవసాయ భూమి వరద నీటిలో మునిగిపోయింది. వరద ప్రభావిత జిల్లాల్లో బిస్వనాథ్ లఖింపూర్, హోజాయ్, బొంగైగావ్, నల్బరి, తముల్పూర్, ఉదల్గురి, దర్రాంగ్, ధేమాజీ, హైలకండి, కరీంగంజ్, హైలకండి, గోల్పరా, నాగావ్, చిరాంగ్, కోక్రాఝర్ ఉన్నాయి.
సీఎం సమీక్ష
వరదలు మానవులపైనే కాకుండా జంతువులపై కూడా భారీ ప్రభావాన్ని చూపాయి. రాష్ట్రంలోని 93,895 జంతువులు వరద కారణంగా భారీ నష్టాన్ని చవిచూశాయి. ఆ తర్వాత అస్సాం సిఎం హేమంత బిస్వా శర్మ వరద పరిస్థితులలో నేషనల్ పార్క్‌లోని జంతువుల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్ర పోలీసులు, కజిరంగా నేషనల్ పార్క్ పరిపాలనతో సమావేశం నిర్వహించారు.