తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రను ఆపాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. సోషల్ మీడియా జరిగే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖుల స్థాయిని బట్టి బందోబస్తు ఉంటుందని, లోకేష్ విషయంలో ఆ నిబంధనలు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
శుక్రవారం బంగారుపాలెంలో లోకేష్ పాదయాత్ర సమయంలో పోలీసులు మూడు ప్రచార వాహనాలను సీజ్ చేశారు. ఒక సౌండ్ సిస్టం వాహనం, ఒక ప్రచార రథం, ఒక వీడియో కవరేజ్‌కు ఏర్పాటు చేసిన లైవ్ వెహికిల్‌ను సీజ్ చేశారు. పాదయాత్రలో వీటికి అనుమతి లేదని చెప్పారు. అయితే పోలీసుల తీరుపై టిడిపి నేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.