»Bus Falls From Bridge On Highway In Rajgarh Two Killed And 40 Injured Driver Negligence Exposed
Bus Accident : వంతెన పై నుంచి పడిన బస్సు.. ఇద్దరు మృతి..40మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని ఆగ్రా-ముంబై హైవేపై అర్థరాత్రి బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Bus Accident : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని ఆగ్రా-ముంబై హైవేపై అర్థరాత్రి బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్ నుంచి గునాకు వెళ్తున్న బస్సు అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో పచోర్ ప్రాంతంలోని వంతెనపై నుంచి అదుపు తప్పి కిందపడింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. బాధితుల ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పచోర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆకాంక్ష శర్మ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్టేషన్ ఇన్ఛార్జ్ ట్రాక్టర్ ట్రాలీలో క్షతగాత్రులను పచోర్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అంబులెన్స్ అక్కడికి చేరుకోకపోవడంతో క్షతగాత్రులకు చికిత్స అందక తీవ్ర అవస్థలు పడ్డారు.
బాలాజీ బస్ సర్వీస్ కు చెందిన బస్సు ఆగ్రా-ముంబై హైవేపై పచోర్ సమీపంలో కల్వర్టు నుండి పడిపోయింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 40 మంది గాయపడ్డారు. బస్సులో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన 40 మందిలో 17 మందిని షాజాపూర్‌కు, ఐదుగురిని ఇండోర్‌కు తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి ఆకాంక్ష శర్మ తెలిపారు. మృతుల్లో ఒకరిని గుర్తించారు. కాగా, మరొకరి గుర్తింపు ఇంకా కొనసాగుతోంది. చనిపోయిన ఒకరి పేరు హరిఓం కుష్వాహ. అతను భటోలి జిల్లా అశోక్‌నగర్ నివాసి. పచోర్ ఆసుపత్రి బృందం గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించింది. గాయపడిన 17 మందిని షాజాపూర్‌కు, ఐదుగురిని ఇండోర్‌కు తరలించారు. మిగిలిన చికిత్స పచోర్లోనే కొనసాగుతోంది.
డ్రైవర్-కండక్టర్ పరారీ
ఘటనానంతరం డ్రైవర్, కండక్టర్ పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు. బస్సు యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. ఇండోర్‌లోని తీన్ ఇమ్లీ బస్టాండ్ నుండి బస్సు బయలుదేరిందని చెబుతున్నారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో అతివేగం వల్లే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం డ్రైవర్-కండక్టర్ కోసం పోలీసు బృందం వెతుకుతోంది. ఇద్దరినీ త్వరలోనే పట్టుకుంటామని స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు.