తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయపరంగా బద్ధ శత్రువులుగా ఉంటున్న వారు కలిసి మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడుతూ నవ్వులు పంచుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరస్పరం మాట్లాడుకున్నారు. ఇటీవల హుజురాబాద్ లో తాను పర్యటిస్తే ఎందుకు పాల్గొనలేదని కేటీఆర్ ఈటలను ప్రశ్నించారు.. దీనికి ఈటల సరదాగా సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరబూశాయి. గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందనరావు, రాజాసింగ్ వద్దకొచ్చి ప్రత్యేకంగా మాట్లాడాడు. హుజురాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. పిలిస్తే కదా హాజరైయ్యేదంటూ ఈటల సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదని కేటీఆర్ కు ఈటల తెలిపినట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ సంభాషిస్తుండగా మధ్యలో ప్రతిపక్ష నాయకుడు భట్టీ విక్రమార్క వచ్చారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలువడం లేదంటూ భట్టి చెప్పినట్లు సమాచారం. ఈటల, భట్టి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. ఈలోపే గవర్నర్ వస్తుండడంతో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ కేటీఆర్ కు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలపడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కూడా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. రాజాసింగ్ వేసుకొచ్చిన కాషాయ చొక్కా విషయమై కేసీఆర్ సరదాగా మాట్లాడారు. ‘చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుంది.. ఆ రంగు నాకు ఇష్టం ఉండదు’ అని కేటీఆర్ అన్నట్లు తెలుస్తున్నది. రాజా సింగ్ బదులు ఇస్తూ.. ‘కాషాయ రంగు చొక్కా భవిష్యత్ లో మీరు వేసుకోవెచ్చేమో’ అని తెలిపాడు. అంటే భవిష్యత్ లో మీరు కూడా బీజేపీలోకి రావొచ్చు అని పరోక్షంగా రాజా సింగ్ మాట్లాడారు. కేటీఆర్ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.