»Two Indian Students Died In America Road Accident
US : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
చదువుకోవడానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
America road accident : భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కలలు కని ఇద్దరు తెలంగాణ విద్యార్థులు(Students) అమెరికాకు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ప్రమాదవశాత్తూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరీంనర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ నవీన్, డాక్టర్ స్వాతిల కుమారుడు నివేష్(20). అలాగే జనగామ జిల్లా శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు కమల్ కుమార్, పద్మల పెద్ద కొడుకు గౌతమ్ కుమార్(19). వీరిద్దరు అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి వీరు యూనివర్సిటీ నుంచి ఇంటికి కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. మిత్రులతో కలిసి వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్లారని రాత్రి 11:30 సమయంలో ఆలస్యంగా ఇంటికి చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగిందని భిన్నమైన వార్తలు వెలువడుతున్నాయి. వారు కారులో ఇంటికి చేరే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం వీరి కారును బలంగా ఢీకొట్టింది.
దీంతో కారులో వెనక సీట్లో కూర్చున్న నివేష్, గౌతమ్‌లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన విషయాన్ని అమెరికాలోని(America)అక్కడి స్థానిక పోలీసులు తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అందుకు రెండు రోజుల సమయం పట్టేలా ఉందని తెలిపారు.