»Manjummel Boys Movie Review Is Manjummel Boys A Hit In Telugu
Manjummel Boys Movie Review: మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో హిట్ కొట్టిందా?
ప్రస్తుతం మలయాళ చిత్రాలు సౌత్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల ప్రేమలు చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే మలయాళంలో సంచలన విజయం సాధించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులో వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం:మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు:సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ సంగీతం:సుశిన్ శ్యామ్ నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్: చిదంబరం విడుదల: 06-04-2024
కథ
కుట్టన్(షౌబిన్ షాహిర్) అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో నివసిస్తుంటాడు. తనతో సుభాష్(శ్రీనాథ్ భాషి)తో పాటు మరికొందరు స్నేహితులు సొంత ఊళ్లనే ఉంటూ చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వీళ్లకు ఒక అసోసియేషన్ ఉంటుంది. ఈ గ్యాంగ్ పేరు మంజుమ్మల్ బాయ్స్. అయితే వీళ్లంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత చివరగా గుణ కేవ్స్ చూడటానికి వెళ్తారు. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ కేవ్స్ చాలా ప్రమాదకరమైనవి. వందల అడుగుల లోతులో లోయలుంటాయి. అందులో డెవిల్స్ కిచెన్ కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. 150 అడుగుల లోతు ఉండే ఈ లోయలో ఇప్పటివరకు 13 మందికి పైగా పడ్డారు. ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ చోటుకు వెళ్లడానికి పోలీసులు నిషేధం కూడా విధించారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ పోలీసులకు తెలియకుండా ఆ కేవ్స్‌లోని ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. సరదగా గడుపుతున్న సమయంలో ఆ ప్రమాదకరమైన కేవ్స్లో సుభాష్ పడిపోతాడు. మరి సుభాష్ లోయలో పడిపోయిన తర్వాత ఏమైంది? తను లోయ నుంచి బయటకు వచ్చాడా? అసలు ఎలా వచ్చాడు? తన స్నేహితులు అతనిని ఎలా కాపాడుకున్నారు? అతనిని రక్షించేందుకు ఏం చేశారనే విషయాలు తెలియాలంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇది రియల్ స్టోరీ. 2006లో స్నేహితులందరూ గుణ కేవ్స్‌కి వెళ్లినప్పుడు.. తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసమే ఈ స్టోరీ. సినిమా చూసినంతసేపు ఆ కేవ్స్లో మనమే ఉన్నాం అనేలా ఉంటుంది. ఇంటర్వెల్ వరకు కథ స్లోగానే సాగుతుంది. అప్పటివరకు వాళ్లు ట్రిప్‌కు వెళ్లడం, అల్లరి ఉంటాయి. ఎప్పుడైతే గుణ కేవ్స్ చూడటానికి వెళ్తారో అప్పుడు కథలో ఇంకా ఆసక్తి పెరుగుతుంది. సుభాష్ ఆ డెవిల్స్ కిచెన్‌లో పడిపోయిన తర్వాత కథ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సుభాష్ లోయలో పడిపోయిన తర్వాత అతని పరిస్థితిని చూపిస్తు.. మరోవైపు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కథకు బలమైన ఎమోషన్స్ అందించారు. సినిమా చూస్తున్నంతసేపు చాలా ఆసక్తిగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
కుట్టన్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన తన స్నేహితులు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు చేసే అల్లరి, వాళ్ల స్నేహ బంధం అంతా సహజంగా ఉంటుంది. దర్శకుడు రాసుకున్న కథనం తెరపై చక్కగా కనిపిస్తుంది. అయితే ద్వితీయార్థంలో అంతగా ట్విస్ట్‌లు ఉండవు అంతే.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గుణ కేవ్స్ సెటప్ ఈ సినిమాకి బిగ్ అట్రాక్షన్. నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.