Congress : కాంగ్రెస్ పార్టీ ఖాతాలను జప్తు చేసిన తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థుల వద్ద ఎన్నికల ప్రచార సామగ్రి, ప్రకటనలు, ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదు. దీని కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో సాధారణ ప్రజల నుండి మద్దతుగా ఓట్లతో పాటు నోట్లను అడుగుతున్నారు. నిజానికి దేశంలో జరగనున్న లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగాల్సి ఉంది. ఇందులో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని 6 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం కూడా ఉత్కంఠగా మారుతోంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వెలుగులోకి వచ్చిన ఫోటో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరిస్తోంది.
జబల్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్ తనదైన శైలిలో ప్రచారంలో ఓట్లతో పాటు కరెన్సీ నోట్ల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్ ఫోటో బయటికి రావడంతో ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు ఓటు వేయడానికి ప్రజలకు నోట్లు ఇచ్చే రోజులు పోయి.. ఓట్లతో పాటు నోట్లు అడుక్కోవాల్సి వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దినేష్ యాదవ్ మధ్యతరగతి వ్యాపారి అయినప్పటికీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దినేష్ చరాస్థి విలువ రూ.1 కోటి 10 లక్షలు కాగా, స్థిరాస్తి విలువ రూ.2 కోట్ల 58 లక్షలు. కాంగ్రెస్ నుంచి విపక్షాల వరకు అన్ని పార్టీలపై బీజేపీ నియంతృత్వ వైఖరి అవలంభిస్తున్న తీరు యావత్ దేశానికి తెలుసని దినేష్ యాదవ్ ప్రజలతో అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లగా, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థుల వద్ద డబ్బు లేదు. ఈ పరిస్థితిలో ప్రజల నుండి అభ్యర్థులు సహకారం ఆశిస్తున్నారు. ప్రజల నుంచి రూ.10 నుంచి రూ.20 వరకు సహకరించాలని కోరుతున్నట్లు దినేష్ యాదవ్ తెలిపారు. తనకు ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని, జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన విజయయాత్ర సాగుతుందని దినేష్ యాదవ్ పేర్కొన్నారు.