IPL 2024 : ఉప్పల్‌లో మ్యాచ్ చూడనున్నారా? ఈ వస్తువులకు నో ఎంట్రీ
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరోసారి క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మీరు నేరుగా సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌ను చూసేందుకు వెళుతుంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటంటే...
IPL 2024 Sunrisers VS Mumbai Indians : క్రికెట్ అభిమానుల్ని అలరించేందుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం(Uppalstadiuam) సిద్ధమైంది. ఈ రాత్రి 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SUNRISERS VS MUMBAI INDIANS) మధ్య మ్యాచ్ మొదలుకానుంది. దీంతో హైదరాబాద్ నగరంలో అందుకు అనుగుణంగా కొన్ని మార్పులు జరిగాయి. మెట్రో రైలు టైమింగ్స్‌ని పొడిగించారు. రాత్రి 11:30 గంటల వరకు బస్సులనూ తిప్పుతారు. ఇంకా మ్యాచ్‌కు సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
మ్యాచ్ జరగడానికి మూడు గంటల ముందు మాత్రమే ప్రేక్షకుల్ని స్టేడియం లోపలికి అనుమతిస్తారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 2800 మంది పోలీసులు దీని కోసం పని చేస్తున్నారు. 360 సీసీ కెమేరాలను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అంబులెన్స్, మెడికల్, ఫైరింజన్ సర్వీసుల్ని అందుబాటులో ఉంచారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే అంతా పార్కింగ్ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్టేడియంలోకి ఎలాంటి వస్తువులనూ అనుమతించరు. సిగరెట్లు, లైటర్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, బ్యటరీలు, హెల్మెట్లు, పెర్ఫ్యూమ్లు, బైనాక్యులర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమేరాలు, పెన్నులు, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు తదితరాలను అనుమతించరు. సెల్ఫోన్లకు మాత్రమే అనుమతి ఉంది. అలాగే మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీంలూ ఉన్నాయి.