Chandrayaan 3: గత ఏడాది ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరించింది. దీని తరువాత, భారతీయ శాస్త్రవేత్తలకు ప్రపంచం నలుమూలల నుండి అభినందన సందేశాలు వచ్చాయి. ప్రధాని మోడీ కూడా ఇస్రో కేంద్రానికి వెళ్లి చంద్రయాన్-3 ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ పెద్ద గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి, అంతర్జాతీయ ఖగోళ సంఘం (IAU) మార్చి 19న శివశక్తి పేరును ఆమోదించింది. అంటే ఇప్పుడు అధికారికంగా చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా శివశక్తి పాయింట్‌గా గుర్తించబడుతుంది.
ప్లానెటరీ నామకరణం గెజిటీర్ ప్రకారం.. గ్రహ వ్యవస్థ నామకరణం కోసం IAU వర్కింగ్ గ్రూప్ చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్ కు శివశక్తి పేరును ఆమోదించింది. ఒక గ్రహంపై ఉన్న ప్రదేశాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి పేరు పెట్టారు. దీనితో ఆ స్థలాన్ని భవిష్యత్తులో సులభంగా గుర్తించవచ్చు. ప్రజలు దాని గురించి చర్చించుకోవచ్చు. ఆగస్టు 23, 2023న చంద్రునిపై విజయవంతంగా దిగిన మూడు రోజుల తర్వాత బెంగళూరులోని ఇస్రో సెంటర్లో ఈ పేరును ప్రధాని మోడీ ప్రకటించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రదేశానికి శివశక్తి అని, 2019లో చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ చేసిన ప్రదేశానికి తిరంగా అని పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇది కాకుండా, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని కూడా ప్రకటించారు.