dry ginger benefits : తాజా అల్లం(ginger) మంచిదా? ఎండ బెట్టిన అల్లం మంచిదా? అని ఈ మధ్య కాలంలో చర్చలు జరుగుతున్నాయి. మనం శొంఠి అనే దాన్నే డ్రై జింజర్(dry ginger), లేదా పొడి అల్లం అని పిలుస్తుంటారు. తాజా అల్లంతో పోలిస్తే శొంఠితో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా మరి?
భారతీయ సంప్రదాయ వైద్యాలు, ఆయుర్వేద మందులు తదితరాల్లో అల్లంతో పోలిస్తే శొంఠిని ఎక్కువగా ఉపయోగిస్తారు. జలుబు, కఫం, వికారం…. తదితర ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది చక్కని మందులా పని చేస్తుంది. ఈ విషయంలో మాత్రం అల్లం(ginger) కంటే శొంఠి ఎక్కువ ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల అల్లానికి ఘాటు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లనూ ఇది కలిగి ఉంటుంది. అదే డ్రై జింజర్లో అయితే పూర్తిగా తేమ ఉండదు. అందుకనే చాలా కొంచెం శొంఠిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా చేరి గాఢంగా ఉంటాయి. దీని వల్ల శరీరం లోపల అవాంఛితంగా వచ్చే వాపుల్లాంటివి నియంత్రణలోకి వస్తాయి.
ఎప్పుడైనా తాజా అల్లం అందుబాటులో లేనప్పుడు వంటల్లో డ్రై జింజర్నీ వాడొచ్చు. అయితే శొంఠి మామూలు అల్లంతో పోలిస్తే ఘాటుగా ఉంటుంది. అందుకని దాన్ని అల్లం వేసినట్లుగా ఎక్కువ పరిమాణంలో వేయకూడదు. బదులుగా చిటికెడు శొంఠి పొడి అయినా సరిపోతుంది. అల్లం కంటే ఎక్కువ ఘాటును అది కూరకు అందిస్తుంది. తాజా అల్లమైనా, శొంఠి(dry ginger) అయినా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అయితే శొంఠిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యల నుంచి ఇది మెరుగైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనిలో ఉన్న ఔషధ లక్షణాల వల్ల జీర్ణానికి అవసరమైన ఎంజైములు తగినంత స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైనా కడుపు అప్సెట్ అయింది అనిపిస్తే దీన్ని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితాలుంటాయి.