»Maldives Prez Tones Down Anti India Rhetoric Urges New Delhi To Extend Debt Relief
Maldives : స్వరం మార్చిన మాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జు!
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తాను పదవికెక్కినప్పటి నుంచి భారత్ తో వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. అయితే మొదటి సారి ఆయన కాళ్లబేరానికి వచ్చి మాట్లాడారు. ఎందుకంటే...
Maldives prez : ఇప్పటి వరకు భారత్, మాల్దీవుల మధ్య వ్యతిరేక పూరిత వాతావరణాన్ని సృష్టించిన ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు ఇప్పుడు ఉన్నట్లుండి స్వరం మార్చారు. తమకు భారత్ ఎప్పుడూ మంచి మిత్రుడేనని అన్నారు. గతేడాది చివరి నాటికి భారత్కు మాల్దీవులు దాదాపుగగా 400.9 మిలియన్ డాలర్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించేందుకు తమకు కాస్త వ్యవధి ఇవ్వాలని ఆయన కోరారు. తిరిగి వీటిని చెల్లించడంలో ఉపశమనం(relief) కలిగించాలని అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన గురువారం మొదటి సారిగా స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
వచ్చే మే 10వ తేదీ నాటికి భారత్ బలగాలు తమ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని మయిజ్జు గతంలో డెడ్లైన్ విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్దీవులకు(Maldives) సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులనూ నిర్మించి ఇచ్చిందన్నారు.
ఇరు దేశాల మధ్యా స్నేహ సంబంధాలు కొనసాగుతాయనడంలో ఏ మాత్రమూ సందేహం లేదన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పనుల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పెరిగిపోయాయన్నారు. తిరిగి చెల్లించేందుకు కొన్ని మినహాయింపులు కోరుతున్నామన్నారు. ఇదే విషయాన్ని దుబాయ్లో జరిగిన కాప్ 28 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ చర్చించినట్లు చెప్పారు.