»Operation Valentine Movie Review Did Varun Tej Hit
Operation Valentine Movie Review: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్‌గా వచ్చిన ఈ చిత్రం మరి ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం: ఆపరేషన్ వాలెంటైన్ నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహాని శర్మ తదితరులు సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాత:సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద విడుదల: 1/03/2024
కథ
అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర(వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేస్తుంటాడు. భయపడకుండా ధైర్య సాహసాలతో రుద్ర ముందుకు అడుగువేస్తుంటాడు. అక్కడ పని చేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్)తో ప్రేమలో ఉంటాడు. అహనా చెప్పినా వినకుండా.. గగనవీధిలో అర్జున్ అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. అలా ఓసారి ప్రాజెక్ట్ వజ్ర చేపట్టి తొలి ప్రయత్నంలోనే విఫలం కావడంతో పాటు తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్(నవదీప్)ను కూడా కోల్పోతాడు. దీంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రాజెక్ట్ వజ్రను బ్యాన్ చేస్తారు. గాయాలు నుంచి కోలుకున్న రుద్ర 2019లో ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. అసలు ఆపరేషన్ వాలైంటైన్ లక్ష్యమేంటి? ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేంటి? చివరకు అది సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు చేసిన పుల్వామా ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇందులో 40 మంది జవాన్లు వీర మరణం పొందారు. దీనికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని ఫిబ్రవరి 26న బాల్కోట్ స్ట్రైక్ నిర్వహించింది. సక్సెస్ అయ్యింది. ఈ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీని రూపొందించారు. దేశభక్తిని, ఉగ్రదాడులను, భారత ఎయిర్ ఫోర్స్ పాత్రని ప్రధానంగా చేసుకుని ఆపరేషన్ వాలెంటైన్‌ని రూపొందించారు. ప్రాజెక్ట్ వజ్రతో కథని మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఒక్కొక్క సంఘటనని తెరపై ఆవిష్కరిస్తూ వెళ్లాడు. పుల్వామా దాడి, ప్రతిగా ఆపరేషన్ వాలెంటైన్, ఆ తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నెహ్రూ, దాన్ని తిప్పి కొట్టేందుకు వజ్ర ప్రయోగాన్ని అమలు చేయడం వంటి సంఘటనలతో ఈ చిత్రం సాగుతుంది. దేశభక్తి నేపథ్యంలో భావోద్వేగాలు, గగనతంలో ఫైటర్ జెట్ల వీర విహారంతో కూడిన విజువల్స్ ఈ సినిమాకి ప్రధాన బలం, ప్రత్యేకమైన ఆకర్షణ. పుల్వామా దాడిలో సైనికుడు తన ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడటం, పై అధికారి ‘ఏం జరిగినా చూసుకుందాం’ అంటూ రుద్ర సాహసాల్ని ప్రోత్సహించడం, శత్రువుల స్థావరాల్ని ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వజ్ర ప్రాజెక్ట్ ప్రయోగంతో కూడిన పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. నాయకానాయికల మధ్య సాగే ప్రేమకథలోనే గాఢత లేకపోవడం, ఈ మధ్యే వచ్చిన ‘ఫైటర్’ కథకి చాలా దగ్గరగా ఉండటం సినిమాకి మైనస్‌గా మారింది.
ఎవరెలా చేశారంటే?
వరుణ్‌తేజ్ అర్జున్ రుద్రదేవ్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో నిజమైన వింగ్ కమాండర్‌గానే కనిపించాడు. అతని బాడీ లాంగ్వెజ్, మాటలు అన్ని నిజమైన సైనికుడిలా కనిపించాయి. మానుషి చిల్లర్ పాత్రకీ ప్రాధాన్యం ఉంది. మానుషి అద్భుతంగా నటించింది. సినిమాలో ఎక్కువగా హీరోహీరోయిన్లే కనిపిస్తారు. కానీ వీళ్ల మధ్య ప్రేమ కెమిస్ట్రీ కనిపించదు. మిగిలిన నటులు వాళ్ల పాత్రలకు మించి నటించారు.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉంటాయి. నిర్మాణం ఉన్నతంగా ఉన్నా.. కథనంలో బలం లేదు. బడ్జెట్ పరంగా పరిమితులున్నా నాణ్యమైన విజువల్స్‌తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+వరుణ్‌తేజ్, మానుషి చిల్లర్ నటన
+విజువల్స్
+నిర్మాణ విలువలు
+దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు