రైళ్లలో సీటు కోసం జనాలు గొడవలుు పడటం మీరు చూసే ఉంటారు. కానీ… ముగ్గురు మహిళలు.. ఒకరినొకకరు తిట్టుకుంటూ… ఆఖరికి ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? ఇది నిజంగానే జరిగింది. వీళ్లు కొట్టుకోవడమే కాదు.. వీళ్ల వల్ల పక్కవాళ్లకు కూడా దెబ్బలు తగిలాయి.చివరకు వీళ్ల రాద్దాంతం పోలీసుల దాకా కూడా వెళ్లింది. ఆఖరికి వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
తలోజా నివాసి గుల్నాథ్ జుబారే ఖాన్, ఆమె కుమార్తె అంజు ఖాన్, ఆమె పదేళ్ల మనవరాలు రాత్రి 7.30 గంటల సమయంలో థానేలో రైలు ఎక్కారు. కోపర్ ఖైరానే వద్ద రైలు ఎక్కిన స్నేహా దేవే తుర్భే స్టేషన్లో ఖాళీగా ఉన్న సీటులో కూర్చుంది. ఇదే సమయంలో పదేళ్ల చిన్నారిని కూర్చోనివ్వకుండా సీటు లాక్కున్నారని ఆరోపిస్తూ జుబారే ఖాన్, అంజుఖాన్ స్నేహదేవేతో వాగ్వాదానికి దిగారు. మొదట మాటలతో మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారిపోయింది. తగ్గేదేలే అన్నట్లు ముగ్గురు జుట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వచ్చింది.
ఈ లోపు ఘర్షణ పడుతున్న మహిళలను వారించేందుకు అక్కడికి మహిళా కానిస్టేబుల్ శారద ఉగ్లే వచ్చింది. వారి గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కొద్దిసేపు ఆ ముగ్గురు మహిళలు నిశ్శబ్ధంగా ఉండిపోయారు. అయితే ఏమైందో తెలియదు కానీ మళ్లీ ముగ్గురు గొడవకు దిగారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులకు, లేడీ కానిస్టేబుల్ కి కూడా గాయాలవ్వగా, ఆస్పత్రికి తరలించారు.
సీటు విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణలో మహిళా సిబ్బందికి గాయాలయ్యాయని వషి రైల్వే స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ కటారె వెల్లడించారు. కాగా తల్లీకూతుళ్లిద్దరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా అంజుఖాన్ను అరెస్ట్ చేశారు.