ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప ప్రేమ ఎవరిది అని అడిగితే.. ఎవరైనా గుక్క తిప్పుకోకుండా తల్లి ప్రేమ అంటారు. ఇది నిజమే. స్త్రీ తల్లి అయిన దగ్గర నుంచి కేవలం బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. బిడ్డ ఆకలి తీరిన తర్వాతే ఆమె ఆకలి మొదలౌతుంది. బిడ్డ ప్రాణం మీదకు వస్తే.. తన ప్రాణమైనా అడ్డం వేస్తుంది. అందుకు.. ఇదిగో ఈ తల్లి కథే నిదర్శనం. తన ఏడాది బిడ్డ ప్రాణం కోసం ఓ మహిళ ఏకంగా పులితో పోరాడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఉంది. దాని పేరు బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్. ఆ రిజర్వ్ కు వెలుపల కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒకటి రోహనియా. అక్కడ నివాసం ఉండే ఒక మహిళ ఇటీవల తన ఏడాది కొడుకుతో పొలం పనికి వెళ్లింది. అక్కడ ఆమె పని చేస్తుండగా, ఒక పులి ఒక్కసారిగా ఆమె కుమారుడిపై దాడి చేసింది. ఆ చిన్నారిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన ఆ తల్లి పులికి ఎదురు నిలిచింది.
చేతిలో ఏ ఆయుధం లేకున్నా.. కొడుకును పొత్తిళ్లలో పెట్టుకుని పులి దాడిని ఎదుర్కొంది. ఒళ్లంతా గాయాలైనా కొడుకును వదల్లేదు. సాయం కోసం గట్టిగా అరుస్తూ,కొడుకు ప్రాణం కోసం తన ప్రాణం అడ్డు వేసింది. తన పసిప్రాణం.. ఆ పులికి ఆహారం కాకుండా ఉండేందుకు ఆమె తన శక్తులన్నీ పోసి మరి పోరాడింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు గట్టిగా అరుస్తూ, ఆ పులిని భయపెట్టి తరిమేశారు. వెంటనే ఆ మహిళను, ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు శరీరమంతా గాయాలు కాగా, ఆమె కొడుకు కు మాత్రం తలపై గాయమైంది. ఇద్దరు క్షేమంగానే ఉన్నారని వారు చికిత్స పొందుతున్న జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.