న్యాయవాది అంటే ఠక్కున గుర్తుచ్చేది నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, దానిపై నల్ల కోటు. ఇది న్యాయవాదికి ఉండే డ్రెస్ కోడ్. కానీ ఓ న్యాయవాది జీన్స్ వేసుకుని న్యాయస్థానానికి వస్తే అతడికి అనుమతి లభించలేదు. అనుమతి సరికాదా.. అతడిని కోర్టులో వాదనలు వినిపించడానికి కూడా న్యాయమూర్తి అనుమతి ఇవ్వలేదు. వెంటనే అతడిని భద్రతా సిబ్బంది చేత బయటకు పంపించిన ఘటన గువహటి హైకోర్టులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాంలోని గువహటి హైకోర్టులో ఓ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది బీకే మహాజన్ జీన్స్ ప్యాంట్ దుస్తులు ధరించి వచ్చాడు. తన వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వచ్చారు. అతడి వస్త్రధారణను గమనించిన జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా ఆధ్వర్యంలోని న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులను పిలిపించి న్యాయవాదిని కోర్టు నుంచి బయటకు పంపివేసింది. ఇదే కారణంతో అతడి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సురానా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.