BRS:ఢిల్లీ వసంత్ విహార్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయం ఈ రోజు ప్రారంభమైంది. దీనికి బీఆర్ఎస్ భవన్ (BRS Bhavan) అని నామకరణం చేశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనుకున్న సమయం మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇకపై సెంట్రల్ ఆఫీసులోనే వివిధ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. పూజా కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాన్షరెన్స్ హాలులో మంత్రులు, ఎంపీలతో తొలి సమావేశం నిర్వహించారు.
గత 3 రోజుల నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఢిల్లీలో ఉండి కార్యాలయ ప్రారంభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భవనం పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తికాలేదు. ముహూర్త సమయానికి ప్రారంభించాలని పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఇది పార్టీ కార్యాలయం కాదని.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ఈ భవన్ అని నేతలు చెబుతున్నారు.
వసంత్ విహార్లో భూమి పూజ జరిగిన 29 నెలల్లో కార్యాలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. వెయ్యి గజాల స్థలంలో విశాలంగా పార్టీ కార్యాలయం ఉంది. 11 వేల చదరపు అడుగుల్లో ఆఫీసు నిర్మాణం జరిగింది. మొదటి అంతస్తులో సీఎం కేసీఆర్ చాంబర్, ఇతర చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఉంది. 2, 3వ అంతస్తులో 20 గదులు ఉన్నాయి. పార్టీ ప్రెసెడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్స్ సహా 18 రూమ్స్ ఉన్నాయి.