ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రేసింగ్ లీగ్ 10న ప్రారంభమై, 11న ముగుస్తుంది. దీంతో భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. తొమ్మిదో తేదీన ఉదయం పదకొండు గంటల నుండి రేసింగ్ లీగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఖైరతాబాద్ నుండి ఫ్లై ఓవర్ మీదుగా ఐమాక్స్, తెలుగుతల్లి కూడలి వరకు వెళ్లే మార్గాలను మూసివేస్తారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లవలసి ఉంటుంది. ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ నుండి షాదాన్ కాలేజీ, రవీంద్ర భారతికి వెళ్లవలసి ఉంటుంది.
బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్ నుండి నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ రోటరీకి వచ్చే దారిని మూసివేసి, నల్లగుట్ట జంక్షన్ నుండి రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. రసూల్‌పుర, మినిస్టర్ రోడ్డు నుండి వెళ్లే దారిని కూడా క్లోజ్ చేసి, నల్లగుట్ట జంక్షన్ నుండి రాణిగంజ్‌కు మళ్ళిస్తారు. ఇక్బాల్ మినార్ నుండి తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ట్యాంక్ బండ్‌కు వెళ్లే దారిని మూసివేసి, కట్ట మైసమ్మ గుడికి మళ్లిస్తారు.