»Two More Days Of Rain In Telangana July 29th And 30th 2023
Telangana rains: మరో 2 రోజులు వర్షాలు..ప్రకటించని సాయం!
తెలంగాణాలో జులై 22 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 19 మందికిపైగా మరణించారు.
తెలంగాణలో ఇప్పటికే గత వారం రోజులుగా వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో రేపు శనివారం, ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో తేలకపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు అనేక చోట్ల 19 మందికిపైగా మృత్యువాత చెందారు. వర్షాల ప్రభావంతో ప్రధానంగా హనుమకొండలో పలు చోట్ల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం సహా పలు ప్రాంతాలు పెద్ద ఎత్తున ప్రభావితం అయ్యాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపు మేరకు నిరసన చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో శాసనసభ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. ఆ క్రమంలో వరద బాధితులకు రూ.10 వేల సాయంతోపాటు నిత్యవసరాలు అందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు.
దీంతోపాటు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పర్యటించి BRS ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. అనేక ప్రాంతాల్లో నీటమునిగినా కూడా కేసీఆర్, కేటీఆర్ మాత్రం వారి ఇళ్లల్లో సురక్షితంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.