»Telangana Govt And Brs Party Announced Ex Gratia To Karepalli Blast Victims Families
Karepalli Blast ఆత్మీయ సమ్మేళనం మృతులకు రూ.19 లక్షల పరిహారం
మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.19 లక్షలు, గాయపడిన వారికి రూ.5.50 లక్షలు పరిహారంగా అందనుంది. కాగా ఈ ప్రమాదంతో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగారు. ఈ దుర్ఘటనతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో (Athmeeya Sammelanam) జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) భరోసా ఇచ్చింది. ప్రమాద సంఘటనపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KT Rama Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన ముగ్గురు కుటుంబాలకు రూ.15 లక్షల నష్ట పరిహారం ప్రకటించగా.. క్షతగాత్రులకు రూ.4 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లా (Khammam District) కారేపల్లి మండలం చీమలపాడులో (Cheemalapadu) బుధవారం ఆత్మీయ సమ్మేళనంలో బాణా సంచా (Crackers) పేలడంతో ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్యకర్తలు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. వారందరినీ ఆదుకుంటామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) తెలిపారు. దీంతోపాటు నామా ముత్తయ్య ట్రస్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున తాను వ్యక్తిగతంగా అందిస్తామని ఎంపీ వివరించారు.
ఇక వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu Nayak) కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున వ్యక్తిగతంగా అందిస్తానని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.19 లక్షలు, గాయపడిన వారికి రూ.5.50 లక్షలు పరిహారంగా అందనుంది. కాగా ఈ ప్రమాదంతో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగారు. ఈ దుర్ఘటనతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రకటించారు. కాగా మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను త్వరలోనే కేటీఆర్ పరామర్శిస్తారని సమాచారం.