Tarun Chugh: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను (Bandi Sanjay) మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీజేపీలో వర్గాలు ఉండటం, బండి వ్యతిరేక వర్గం ఫిర్యాదులు, పార్టీ మారుతామని బెదిరించడంతో హై కమాండ్ తలొగ్గిందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ సారి అధ్యక్షుడి మార్పు తథ్యం అని రూమర్లు వచ్చాయి.
అంతేకాదు కొత్త అధ్యక్షుడి పేరు కూడా వినిపించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి (kishan reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారట. ఈ రెండు మార్పులు జరుగుతాయనే పుకార్లు షికార్లు చేశాయి. ఈటల రాజేందర్‌కు మరో పదవీ ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో మీడియా ప్రతినిధులు తెలంగాణ బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుగ్ (Tarun Chugh) వివరణ కోరారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చడం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్ (Bandi Sanjay) కొనసాగుతారని స్పష్టంచేశారు. ఇప్పటికే ఓసారి చెప్పామని.. ఇదే విషయం పదే పదే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే స్పష్టత ఇచ్చామని.. ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇవన్నీ ఊహాగానాలేనని.. బీజేపీ తెలంగాణ చీఫ్‌ను మార్చడం లేదని తేల్చిచెప్పారు.
సో.. ఇప్పట్లో తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం అవుతోంది. కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఎందుకు పదే పదే మార్పు అనే వార్త చక్కర్లు కొడుతుందని అనేవారు ఉన్నారు. ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పట్లో మార్చడం లేదని బీజేపీ హైకమాండ్ తేల్చిచెబుతోంది.