»Special Surveillance On Upi Transactions Election Commission Warns Them
Telangana: యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక నిఘా.. వారికి ఎన్నికల సంఘం హెచ్చరిక
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం, నగదు అక్రమ రవాణాపై అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై కూడా నిఘా ఉంచామని, ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష ఉంటుందని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Elections Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణాతో పాటుగా ఆన్లైన్, యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రూ.50 వేలకు మంచి నగదు ఎవ్వరైనా తీసుకెళ్లినా, యూపీఐ ద్వారా ఎక్కువ మందికి డబ్బులు పంపినా పత్రాలు చూపించాల్సిందేనని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆస్పత్రులు, భూ క్రయ విక్రయాలు, వివాహాలకు సంబంధించి డబ్బులు, బంగారం తీసుకెళ్తున్నట్లైతే వాటికి సంబంధించిన ఆధారాలు కచ్చితంగా చూపించాల్సిందేనన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని సూచించారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులకు ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే 1950 నంబర్‌కు 24 గంటల పాటు ఫిర్యాదులు చేయొచ్చన్నారు. ఓటరు నమోదుకు అక్టోబర్ 30వ తేది వరకూ అవకాశం ఉందని, 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.