Rythu Bandhu Scam : రైతుల బీమా సొమ్మును కాజేసిన వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 20 మంది రైతుల పేరుతో కోట్లాది రూపాయల బీమా సొమ్మును ముఠా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రైతులు బతికి ఉన్నా.. చనిపోయినట్లు వ్యవసాయ అధికారి నకిలీ పత్రాలు సృష్టించి బీమా సొమ్మును కాజేశారు. రైతుబంధు పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించి మరో కోటి రూపాయలు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని గమనించిన బీమా కంపెనీ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కందర్గు మండల వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక విస్తరణ అధికారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరిని విచారిస్తున్నారు.
గొర్రెల పంపిణీ కుంభకోణం మరిచిపోకముందే మరో కుంభకోణం బయటపడడంతో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అన్నదాతలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం చనిపోయిన రైతులకు రైతు బీమా కింద రూ. 5 లక్షలు.. రైతు బంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు రూ. 10,000 అందించింది. కానీ అవినీతి అధికారులు ఈ పథకంలో లొసుగులను తమకు అవకాశాలుగా మార్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ. కోటి రూపాయలకు పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు బ్యాంక్ గుర్తించింది. వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు ఈ కుంభకోణానికి తెరతీశారు. అన్నదాతల వివరాలు సేకరించి.. వారంతా చనిపోయారని తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసి కోటి రూపాయల వరకు నష్టపరిహారం నిధులు స్వాహా చేసినట్లు తేలింది.
ఎల్ఐసీ ఫిర్యాదుతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. రైతు బీమా కింద ఇచ్చే నష్టపరిహారాన్ని ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఎల్ఐసి క్షేత్ర స్థాయిలో ఆ క్లెయిమ్లపై చెల్లింపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో కోటి రూపాయలకు పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ముంబైలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయం అందించిన సమాచారం మేరకు అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రైతుబంధు పొందేందుకు భూమి యజమాని పేరు ధరణిలో నమోదు చేసి బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానం చేయాలి. ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ నిధులు ఎలా దారి మళ్లించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.