KCR వద్ద బంట్రోతుగా ప్రభాకర్ రెడ్డి.. కొత్తగా చేసిందేమీ లేదని రేవంత్ ఫైర్
బీఆర్ఎస్, బీజేపీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు, నేతలు దుబ్బాకకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు.
Revanth Reddy: కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). దుబ్బాక నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. దుబ్బాకను కేసీఆర్ కుటుంబం పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. బై పోల్లో గెలిచిన రఘునందన్ కూడా ఏమీ చేయలేదని ఆరోపించారు.
కేసీఆర్ కాదు.. హరీశ్ రావు కూడా అలానే దుబ్బాక నిధులను సిద్దిపేట తరలించారని ఆరోపించారు. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న రామలింగారెడ్డిని ఎందుకు మంత్రిగా చేయలేదని అడిగారు. దుబ్బాక ప్రజలు కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు.. రఘునందన్ రావును చూశారు.. ఆదర్శ రైతు చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని చూడాలని కోరారు. రఘునందన్ రావు రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉంటారు.. దుబ్బాకకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉందని.. ఆయనది పాత చింతకాయ పచ్చడే అన్నారు.
సిటీ చుట్టూ 10 వేల ఎకరాల భూమిని కేసీఆర్ ఆక్రమించారని రేవంత్ (Revanth) ఆరోపించారు. కేసీఆర్ బక్కొడు కాదని బకాసురుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో పడుకుంటే కుంకర్ణుడు అని.. లేస్తే మింగుతాడు, మింగితే పడుకుంటాడని మండిపడ్డారు. దుబ్బాకకు పట్టిన శని కేసీఆర్ కుటుంబం అని ఫైరయ్యారు. ఇక్కడకు వచ్చిన సబ్ స్టేషన్లు, నిధులు, కాలేజీలు సిద్దిపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు.