Revanth:భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేద్దాం రా.. ఈటలకు రేవంత్ సవాల్
మునుగోడు బై పోల్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. తాము డబ్బులు తీసుకున్నట్టు భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Revanth reddy:మునుగోడు బై పోల్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ (etala rajender) చేసిన కామెంట్స్ కాకరేపాయి. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు గట్టిగానే స్పందించారు. తాము డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రావాలని ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరారు. అమ్మవారి ఆలయం వద్దే తేల్చుకుందామని స్పష్టంచేశారు. తడి బట్టలతో వచ్చి ఈటల రాజేందర్ ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి (revanth) కోరారు.
అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని మరో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసే దమ్ము ఈటలకు ఉందా అని ప్రశ్నించారు. నిన్న చేసిన కామెంట్లపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. డబ్బులు తీసుకున్నారు.. ఆధారాలు ఎక్కడి నుంచి చూపించాలని అడిగారు. వారి మనసాక్షికి తెలియదా అని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు బీజేపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఏం చేసిందని అడిగారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇటు రేవంత్, ఈటలకు తమ్ముళ్లు అంటూ బీజేపీ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ట్వీట్ చేశారు. మనలో మనకు గొడవలు ఎందుకు అని హితవు పలికారు.
రేవంత్ వర్సెస్ ఈటల ఇష్యూకి సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలేనని అన్నారు. ఇద్దరు నేతలను విమర్శించారు. బై పోల్ సమయంలో కొనుగోలు లెక్కలు తేడా వచ్చాయని చెప్పారు. హుజురాబాద్ అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌కు కౌశిక్ రెడ్డి ప్రత్యర్థి కాగా.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవీ చేపట్టిన వెంటనే కౌశిక్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జీగా ఉన్నారు. గత ఎన్నికల్లో (2018) కాంగ్రెస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన బై పోల్‌లో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.