Revanth Reddy Another miracle in Telangana in December
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేస్తాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతోనే కాంగ్రెస్ ఆ ఆరు గ్యారంటీలు ప్రకటించిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా 2009 డిసెంబర్ 9న ఒక అద్భుతం జరిగిందని.. రాబోయే డిసెంబర్లో తెలంగాణలో మరో అద్భుతం జరగబోతోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలను కల్వకుంట్ల కుటుంబం పట్టిపీడిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణంలో దోపిడీ జరిగిందని వెల్లడించారు. అభివృద్ధి, కట్టడాల పేరిట తెలంగాణలో ప్రజా ధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని అన్నారు. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నారు. సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం అసన్నమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీ పతకాలు ఇవే.
1. మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం – రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
2. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
3. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
4. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
5. రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు.
6. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు.