Removal of JPS from Duties And Appointment Of New Ones
JPS:డిమాండ్లపై జేపీఎస్‌లు (JPS) పట్టువీడటం లేదు.. తెలంగాణ ప్రభుత్వం కూడా మెట్టు దిగడం లేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (JPS) ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. శనివారం (ఈ రోజు) మధ్యాహ్నం 12 గంటల్లోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరే వారి జాబితా అందజేయాలని అధికారులను కోరింది. విధులకు హాజరుకాని వారి స్థానంలో తాత్కాలికంగా రూ.15 వేల వేతనంతో కొత్త జేపీఎస్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం గత 15 రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శులు (JPS) సమ్మె చేస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం వరకు గడువు ఇచ్చిన జేపీఎస్ వినలేదు. దీంతో శనివారం డెడ్ లైన్ విధించారు. ఈ రోజు విధుల్లో చేరని వారిని డ్యూటీ నుంచి తొలగిస్తారు. డ్యూటీకి వచ్చిన వారి జాబితాను మండల పరిషత్ అధికారులు శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టర్లకు పంపించాల్సి ఉంటుంది. విధులకు రానీ వారి స్థానంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ రోస్టర్ ప్రాతిపదికన నియామకాలు చేపడుతారు.
డిగ్రీ పాసై.. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి జేపీఎస్‌గా (JPS) అవకాశం ఇస్తారు. గతంలో పరీక్ష రాసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. నియామకాలకు సంబంధించి పంచాయతీలకు ఎంపీడీవోలు సమాచారం ఇస్తారు. అనుబంధంగా గ్రామసభ నిర్వహించి, నియామకాలను ఆమోదిస్తూ తీర్మానం చేస్తారు. ఆ జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. జాబితా పరిశీలించి.. ఆదివారం ఖరారు చేస్తారు. సోమవారం వారికి నియామకం ఉత్తర్వులు ఇస్తారు. జేపీఎస్ తొలగింపు, తాత్కాలిక నియామకాల కోసం శని, ఆదివారాల్లో మండల పరిషత్, జిల్లా పంచాయతీ కార్యాలయాలు, కలెక్టర్లేట్లు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపూర్‌లో పంచాయతీ కార్యదర్శి సోని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు (JPS) శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జేపీఎస్‌లు మానసిక వేదనతో కుంగిపోతున్నారని.. తమను రెగ్యులరైజ్ చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు.