దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ జోడో యాత్రలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోడో యాత్రను ఈ నెల ఆయన మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
ఈ నెల 24న తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమై మొత్తం 13 రోజులు యాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజి సెంటర్లో భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 360 కిలోమీటర్ల మేర రాహుల్ జోడో యాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
రోజుకు 31 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందన్నారు జైరాం రమేష్. దసరా సందర్భంగా రాహుల్ 2 రోజులు విరామం తీసుకోనున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిటీల ఇంఛార్జ్ కొప్పుల రాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, భారత్ జోడో యాత్ర జాతీయ కమిటీ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భారత్ జోడో కన్వీనర్ బలరాం నాయక్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నడిబొడ్డు మీదుగా కొనసాగనుండటంతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర నిర్వహణ ఉండాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పీసీసీ సీనియర్ నాయకులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.