»Rahul Gandhi In Bhupalpally Speech At Pannur Village
Bhupalpally:లో రాహుల్ గాంధీ..బీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు
రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన త్వరలోనే అంతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని పేర్కొన్నారు. మరోవైపు యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ బాగుపడింది లేదని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi in Bhupalapalli speech at Pannur Village
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే నిన్న రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి దశలో నిన్న ములుగు జిల్లా నుంచి కాంగ్రెస్ విజయ భేరి యాత్రను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నేడు భూపాలపల్లి(bhupalpally) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జెన్ కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీతోపాటు మరికొంత నేతలు పాల్గొన్నారు.
ఈ ర్యాలీ తర్వాత రాహుల్ గాంధీ పన్నూరు గ్రామం వరకు కాంగ్రెస్ విజయభేరి యాత్రను పునఃప్రారంభించారు. ఆ క్రమంలో ప్రసంగించిన కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో అధికార ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇలా అనేక ప్రాజెక్టులు కట్టడం వల్ల కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని రాహుల్ అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రం మారుతుందని ప్రజలు అనుకుంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే మారిందన్నారు. ప్రజల జీవన విధానం మాత్రం మారలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణకు బదులు అప్పుల తెలంగాణగా మారిందన్నారు. అనేక మంది రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదన్నారు. దీంతోపాటు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తుల బాధ పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రాహుల్ అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కేసీఆర్(KCR) నియంత పాలన త్వరలోనే అంతమవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.