తెలంగాణ సీఎంవో ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్యీతా సబర్వాల్ (IAS officer Sita Sabharwal) మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్.. ఇటీవల వివిధ వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటనపై రియాక్ట్ అవుతూ ఓ ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్‌కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఐపీఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా మహిళలు నిస్సహాయ స్థితిలో నిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్ (Manipur) లోని హింసాకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కు రాష్ట్రపతి(President)ని కూడా ట్యాగ్ చేశారు. రాజ్యాంగపరమైన అధికారాలను అమలు చేయాలని కోరారు. ఈ ట్వీట్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై స్మితా సభర్వాల్ సత్వరమే స్పందిస్తుంటారని… మీరు బాధ్యతలను నిర్వర్తిస్తున్న తెలంగాణలో జరిగిన దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నామని చెప్పారు.
నల్గొండ జిల్లాలో ఒక దళిత మహిళా సర్పంచ్ (Female Sarpanch)పై రక్తం వచ్చేలా దాడి చేశారని… దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ వ్యవహారశైలిపై పలువురు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి రాజకీయ నాయకురాలిగా ఉందని విమర్శిస్తున్నారు. నల్గొండ (Nalgonda) ఘటనపై స్మితా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. “మణిపూర్ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిచాల్సిందే మేడమ్. ఈ సమస్యను అక్కడి ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణలో కూడా మహిళలపై అత్యాచారాలు, అక్రమ రవాణా వార్తలు కలవర పరుస్తున్నాయి. వాటి మీద మీరు దృష్టి సారించగలరు. వేధింపులకు గురైన మహిళా పారిశ్రామికవేత్త శేజల్ సమస్యను వెంటనే పరిష్కరించగలరు.” అని కామెంట్లు పెడుతున్నారు.