KCR ఎక్స్పైరీ డేట్ అయిపోయింది: ప్రియాంక గాంధీ విసుర్లు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలం చెల్లిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగలేదని విమర్శించారు.
Priyanka Gandhi: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నారని, చేసిందేమీ లేదన్నారు. ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. పాలకుర్తి బహిరంగ సభలో మాట్లాడారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలని నినాదించారు. రైతులకు రుణమాఫీ అమలు చేయలేదని విరుచుకుపడ్డారు.
ప్రజల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రియాంక (Priyanka) చెప్పారు. పదేళ్లలో ప్రజల ఆకాంక్షల నెరవేరలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎందరో ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. అమరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్ష నెరవేరాలన్నారు. నిరుద్యోగులు కష్టాలు తొలగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని కోరారు. పదేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని అడిగారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ప్రియాంక స్పష్టంచేశారు.
ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని చెప్పారు. రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతులకు ఏడాదికి రూ.15 వేలు, వరికి కనీస మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రతీ మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు. పాలకుర్తి తర్వాత హుస్నాబాద్ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు.