Amith Shah అప్పుల కుప్పగా తెలంగాణ, కేసీఆర్పై విసుర్లు
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
Amith Shah: తెలంగాణ సీఎం కేసీఆర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచరా లంచగొండి సమితి అని ధ్వజమెత్తారు. మియాపూర్ భూముల కుంభకోణంలో రూ.4 వేల కోట్ల దోపిడీ జరిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం జరిగిందని చెప్పారు. మిషన్ కాకతీయలో రూ.22 వేల కోట్ల స్కాం జరిగిందని తెలిపారు. వరంగల్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ సర్కార్ చేసిన కుంభకోణాలను చెప్పేందుకు వారం రోజుల సమయం సరిపోదని అమిత్ షా (Amith Shah) అన్నారు. ఇక్కడ మద్యం ఏరులై పారుతోందని ధ్వజమెత్తారు. విమోచన దినోత్సవం కూడా జరపడం లేదన్నారు. మజ్లిస్ పార్టీకి బీఆర్ఎస్ తలొగ్గిందని విరుచుకుపడ్డారు. పటేల్ పుణ్యమా అని హైదరాబాద్ దేశంలో కలిసిందని చెప్పారు. అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ గుర్తు కారు.. కానీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఓవైసీ నడిపిస్తున్నారని అన్నారు. యువతకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. పేపర్ లీక్ కారణంగా యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. గత పదేళ్లలో తెలంగాణకు రూ.2.5 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణాన్ని అడ్డుకుందని గుర్తుచేశారు. రెండుసార్లు సీఎం పదవీ చేపట్టిన కేసీఆర్.. దళిత ముఖ్యమంత్రి హామీని నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు.