MBNR: జడ్చర్లలోని డా. బీ.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్‌లో ఆదివారం నుంచి కౌన్సిలింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరాల విద్యార్థులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు తరగతులకు హాజరు కావాలని ప్రిన్సిపల్ సుకన్య, కోఆర్డినేటర్ సదాశివయ్య కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
BDK: తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నుంచి 23 మధ్య తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
HYD: నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 1.26 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆటో యజమానులకు రెట్రోఫిట్‌మెంట్ ఎలక్ట్రిక్ కిట్లు 100 శాతం సబ్సిడీతో అందించనుంది. కాగా, ఒక్కో ఆటోకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
MNCL: మంచిర్యాల మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.
RR: పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమనగల్లు మండల పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేంద్రాల 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు, మూసి ఉంచాలని తెలిపారు.
SRPT: కోదాడ పట్టణ పరిధిలోని నయా నగర్ బ్రిలియంట్ స్కూల్ లైన్‌లో వీధి దీపాలు పగలు, రాత్రీ తేడా లేకుండా వెలుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
VKB: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి అన్ని వసతులు కల్పించామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.
NLG: వలిగొండ మండలం రెడ్లరేపాకలో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదో తరగతి పరీక్షకు వెళ్తున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పహిల్వాన్‌పురానికి చెందిన స్టూడెంట్ (16) తన స్కూటీపై వలిగొండలోని పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యదర్శి ఎండి. అఖిల్ పాషా శుక్రవారం ప్రకటించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రిక్కమల్లె మనోజ్, జనరల్ సెక్రటరీలుగా మందా మనోహర్, గొల్లపల్లి మహిపాల్, మహిళా అధ్యక్షురాలిగా కాలికోట రేణుక నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి చురుగ్గా కృషి చేయాలని ఆయన సూచించారు.
NLG: తిప్పర్తిలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్ పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దపల్లి పురపాలక సంఘం తొలి సమావేశం ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం మొదలగు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఈనెల 16న తెలంగాణ క్రీడా పాఠశాల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో రాందాస్ తెలిపారు. 3వ తరగతి విద్యార్థులు, 4వ తరగతి ప్రవేశాల కోసం క్రీడలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, బోనో ఫైడ్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.
ASF: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బెజ్జూర్ 40.1°C, కెరమెరి 39.8, సిర్పూర్ (టీ) 39.7, రెబ్బెన 39.5, కౌటాల 39.3, ఆసిఫాబాద్ 39.2, వాంకిడి 38.9, తిర్యాణి 38.9, దహెగాం 38.9, కాగజ్ నగర్ 38.7, జైనూర్ 38.7, చింతలమానేపల్లిలో 38.6 °Cలుగా నమోదు అయ్యాయి.
SDPT: బెజ్జంకి మండలంలో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలసి ధైర్యం చెప్పారు. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.
GDWL: వ్యర్థాలను రోడ్లపై వేసి ఆరోగ్య సమస్యలను, దోమల బెడదను కొని తెచ్చుకోవద్దు అని కౌన్సిలర్లు తిరుమలేష్, పాగుంట సువర్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 1వ, 12వ వార్డుల్లో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి మున్సిపాలిటీ వాహనాల ద్వారా తరలించారు.