HYD: ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగటంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుంది. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
WGL: ఉమ్మడి WGL జిల్లాలో సిండికేట్ వ్యాపారులు పత్తి, మక్కల రైతులను దోచుకుంటున్నారు. CCI కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఎనుమాముల మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర రూ.8,000 ఉండగా, రూ.3,000 తగ్గించి కొంటున్నారు. తేమ, నాణ్యత సాకులతో రైతులను ముంచుతున్నారు. మక్కలకు మద్దతు ధర రూ.2,400 ఉంటే రూ.1,600-1,800కే కొంటున్నారు. చర్యలు తీసుకోవాలని రైతులు ఇవాళ కోరారు.
MBNR: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం ఉచితంగా పల్లి విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
MBNR: బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీహరి ఆరోపించారు. శనివారం అడ్డాకులలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామం,వార్డుల్లో ప్రజలు సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
SRD: మండల కేంద్రమైన గుమ్మడిదల SC కాలనీలో మంచినీటి సమస్య నెలకొంది. దాంతో అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు నేడు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 15 రోజులనుంచి తాగేందుకు మంచినీళ్లు రావడంలేదని, ఈ విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య వెంటనే తీర్చకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని కొత్త కుంట పాపర్ల పాడు తండాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పార్టీలోకి వస్తున్నారని అన్నారు.
SRCL: భూ వివాదంలో హత్య చేసిన ప్రధాన నిందితుడని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తిలో ఉన్న చిర్రం రవి భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం సిరిగిరి రమేష్‌కు రిజిస్ట్రేషన్ చేశాడన్నారు. కానీ రమేష్ పెట్రోల్ బంకు కాకుండా తనకు భూమి కూడా తిరిగి ఇవ్వకపోవడంతో రమేష్‌ను రవి హత్య చేశాడన్నారు.
HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పారిశుధ్య కార్మికులకు ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ సరస్వత్ శనివారం సూచించారు. ప్లాట్ ఫాం నంబరు 10 సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 120 మంది పారిశుధ్య కార్మికులు, స్టాళ్ల ఉద్యోగులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
MDK: హవెలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్సంపల్లి గ్రామం నుంచి శనివారం డయల్ 100కి వచ్చిన అత్యవసర కాల్‌తో, ఆత్మహత్యాయత్నం చేస్తున్న జ్యోతి అనే మహిళను మెదక్ పోలీసులు సకాలంలో రక్షించారు. హోంగార్డు వరప్రసాద్ (లడ్డు), జైయానంద్, రమేష్ 5 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని, తలుపులు పగలగొట్టి వెంటనే CPR చేసి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MNCL: బీసీలకు 42 రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ శనివారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షంతో ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలన్నారు.
PDPL: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని, పెద్దపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ బీ. నంద కోరారు. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్లలో అందించే అన్ని రకాల సేవలను బ్రాంచ్ ఆఫీసులో సైతం అందిస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ పోస్ట్, పార్సెల్, సేవింగ్ బ్యాంక్, భీమా సేవలు ఉన్నాయన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరంను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ సేవలో పాల్గొని పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని పెంపొందించుకొని పోటీ పరీక్షల్లో నెగ్గుక రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పియు విసి, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
PDPL: గోదావరిఖనిలో ఎకో బజార్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతీయ హరిత దళం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన వచ్చే అనర్ధాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులైన క్యారీ బ్యాగ్స్, ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి వాడకుండా వాటి స్థానంలో జ్యూట్ బ్యాగులు, స్టీల్ బాక్సులు, వస్తువులు వాడాలన్నారు.
ADB: బోథ్ మండలంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18 కోట్లతో సెంటర్ లైటింగ్‌తో మంజూరు రోడ్డు మార్గాన్ని ఆయన పరిశీలించారు. కాలనీల్లో గల బీడీ కార్మికులు, స్థానికులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటించారు. రానున్న రోజుల్లో మండలాన్ని మోడల్ బోథ్‌గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు.
PDPL: గోదావరిఖని గాంధీ చౌరస్తా నుంచి రీగల్ షూ మార్ట్ చౌరస్తా వరకు, లక్ష్మీనగర్ ఏరియాలోని వ్యాపారులకు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సీహెచ్. శ్రీనివాస్ సూచనలు చేశారు. వాహనాలు రోడ్ల మీద నిలపకూడదని షాపుల యాజమానులకు సూచనలు చేశారు. రోడ్లపై వాహనాలను నిలిపితే జరిమానాలు విధిస్తామని సూచించారు. వాహన యాజమానులు షాపుల ముందు నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు.