PDL: రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో మట్టిని తొలగించే భారీ వాహనాలు నిబంధనలు పాటించడం లేదని MVI సంతోశ్ రెడ్డికి బీఆర్ఎస్ యూత్ నాయకుడు బూరుగు వంశీకృష్ణ వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టుల్లోని వాహనాలు పరిమితికి మించి మట్టిని తీసుకుపోవడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు.
ASF: పెంచికల్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యాసంగి సీజన్‌కి సంబంధించిన ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని MLA డా.పాల్వాయి హరీష్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
MHBD: నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం గ్రామంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భవాన నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం నాయకులు అందరూ కలిసి కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఆదేశాలతో 6 నుం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులను ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎంఈవో మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి, వేసవి క్యాంప్ ఇన్‌ఛార్జ్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
NRPT: కార్మికులు తమకు వర్తించే చట్టాలపై అవగాహన కలిగి వుండాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
MBNR: ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మహబూబ్ నగర్ మాజీ పురపాలక చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని కుమ్మరివాడిలో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
SRD: అర్సీపురం పోలీసు స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకి ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కన ఆటో స్టాండ్‌లో తన బ్యాగ్ పెట్టి ఫ్లైఓవర్ పైకి వెళ్లి కిందకు దూకగా వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి బ్యాగులో తాపీ తదితర సామాగ్రి ఉన్నాయి. పోలీసులు మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది
MLG: జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం వర్షం కురిసింది. గత రాత్రి ఈదురుగాలులు, భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు దెబ్బతినడంతో పాటు మామిడి పంటకు గణనీయ నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ గోడును వెలిబుచ్చిన రైతులు ప్రభుత్వ సాయం కోరుతున్నారు.
SDPT: RTC ఇప్పుడే గాడిన పడుతుందని, సమ్మె వద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం సమ్మె మంచిది కాదన్నారు.
KMM: మధిర శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేడే స్ఫూర్తితో కార్మిక సోదరులు ముందుకు సాగుతూ వారి లక్ష్యాలను చేరుకోవాలని తెలియజేశారు.
KMM: కార్మికుల హక్కులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 139 మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సీపీఐ జెండాను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ పట్టణానికి చెందిన జాహ్నవి తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ విడుదల చేసిన ఫలితాలలో సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వేములవాడ పట్టణానికి చెందిన జాహ్నవి ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవిద్యను పూర్తిచేసుకుంది. వేములవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యురాలుగా కొనసాగుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
GJL: ధర్మపురి పట్టణంలో 139 మే డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హమాలీ సంఘం, మున్సిపల్ పారిశుధ్య సంఘం ఆధ్వర్యంలో కార్మికులు జెండాను ఆవిష్కరించి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్మికుల హక్కుల సాధనకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
WGL: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాయపర్తి మండలం ఆర్ఆర్ కాలనీ వద్ద జరిగింది. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
WGL: వరంగల్- నిజామాబాద్ రూట్లో డీలక్స్ బస్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తగ్గింపు ఛార్జీలను మే 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.