BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే స్కాలర్‌షిప్ జమ కాదని స్పష్టం చేశారు. ఆధార్ సీడింగ్ త్వరగా చేసుకోవాలన్నారు.
GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు.
HNK: భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షల కౌంటర్లు, జనరల్ ఫిజీషియన్ విభాగం, ఎముకల శస్త్ర చికిత్స విభాగాల్లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లను కోరారు.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ 2025-26 రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అర్చరీ విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.
వరంగల్ పట్టణ కేంద్రంలోని కొత్తవాడ, BT బజార్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంత దారుణంగా చెత్త పేరుకుపోతే ఏం చేస్తున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏమీ చేయట్లేదా?” అని మండిపడ్డారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు.
NRPT: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ తమ గ్రామాల్లో మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి పాల్గొన్నారు.
ASF: రెబ్బెన మండలం గంగాపూర్ కమాన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఆసిఫాబాద్‌కు చెందిన చునార్కర్ ఏకాంబరం, వడై రవీందర్లపై చర్యలు తీసుకున్నట్లు SI వెంకటకృష్ణ తెలిపారు. బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్, అతివేగం చట్టవిరుద్ధమని ఆయన హెచ్చరించారు.
SRPT: మట్టపల్లి క్షేత్రంలో శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సుప్రభాత సేవ, నిత్యహోమం మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీ లక్ష్మీనరసింహస్వా మి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. అనంతరం రుత్విగ్వరణం, మధుఫర్క పూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు.
ASF: జైనూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MRO ఆడ బిర్షవ్ ప్రకటనలో తెలిపారు. గత నవంబర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఈ ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు, ఇతరులు ఈ వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. వివరాల కోసం MRO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కామారెడ్డి: బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి బిక్కనూర్‌కు వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
NZB: TU పరిధిలో ఎల్ఎల్‌బీ ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు రేపటి నుంచి మార్చ్ 4 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు మిగతా వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించలని సూచించారు.
ఆదిలాబాద్: కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. డిజిటల్ ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
SRPT: పెన్పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
SRPT: తిరుమలగిరి మండలంలోని వెలిశాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లాక్యతండాకు చెందిన నెహ్రూ (30) బైక్‌పై వెళ్తుండగా, వెలిశాల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
NRPT: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కుని ప్రథమస్థానంలో నిలిచారు.