ADB: ఆదిలాబాద్ పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని కామదేవుని దహన కార్యక్రమాన్ని నిన్న రాత్రి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ బండారి అనూష స్థానిక మహిళలతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు.
KNR: హోలీ పండగని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రజలకు సీపీ గౌష్ ఆలం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగ సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత చట్టబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో పలు సూచనలు చేశారు. చర్మం, కళ్లకు హాని చేసే రసాయనిక రంగులను కాకుండా, సహజ సిద్ధమైన రంగులను వాడాలన్నారు.
MBNR: మన్యంకొండలో శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి హనుమద్వాహన సేవ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన హనుమంత వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని ఆలయ వీధుల్లో ఊరేగించగా, భక్తులు జైజైధ్వానాలతో నీరాజనాలు పలికారు.
KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి సోమలింగేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్‌గా దుర్గం మహేష్ పటేల్‌ను ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం నియమించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కమల, ఆలయ పునర్నిర్మాణ దాత పోచారం శంభు రెడ్డి, మహేందర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, జడ్పీటీసీ మాజీ సభ్యులు లక్ష్మి కిషోర్, మాజీ ఎంపీపీ విటల్, మాజీ సర్పంచ్ మోహన్ ఉన్నారు.
MDK: బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి వీ. నీలిమ తెలిపారు. గిరిజన బాలబాలికలకు కాయాకింగ్, కెనోయింగ్, రోయింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. వర్గల్ మండలం సీతారాంపల్లి, నాచారం, జగదేవపూర్ మండలం చాట్లపల్లి, గజ్వేల్ మండలం దాతర్ పల్లి, కొండపాక మండల కేంద్రానికి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
VKB: హోలీ పండుగను ప్రమాదాలకు దూరంగా, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని బంట్వారం ఎస్సై విమల సూచించారు. వేడుకల పేరుతో మహిళలు, యువతులపై బలవంతంగా రంగులు పూయడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మత్తులో వాహనాలు నడిపి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
HYD: MIM ఆధ్వర్యంలో సోమవారం మలక్‌పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దులహ్ బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలతో కలిసి విందు ఆరగించారు.
MBNR: జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.
HYD: తెలంగాణ ఉద్య మకారులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ కోతి మాధవి అన్నారు. తెలంగాణ ఉద్య మకారుల జేఏసీ రాష్ట్రకమిటీ సమావేశం కొత్తపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఇంతకుముందు ఉన్న రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
సిరిసిల్ల జిల్లా 33వ వార్డులోని బీవై నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 33వ వార్డు కౌన్సిలర్ కొండ నరేష్ హాజరై మాట్లాడారు. ప్రజలందరూ నిండు పున్నమిలా సుఖసంతోషాలతో ఉండాలని, ఆత్మీయతలను పంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గాజుల శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, ఆడెపు శ్రీనివాస్, సాప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
VKB: హుస్సేన్‌పూర్ MPPS పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GHM నరసింహులు, క్రాంతి కుమార్, ఇతర ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లల ప్రతిభను చూసి అతిథులు వారిని ఎంతో అభినందించారు.
★ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రతిమ సింగ్★ పైర్ణమి సందర్భం ఏడుపాయలలో ఘనంగా దుర్గమ్మ పల్లకి సేవ★ ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం విద్యార్థులు హాజరు★ రేగోడ్ మండలంలో హీటర్ పేలి ఇల్లు దగ్ధం
MDK: హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు.
MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్వో కిష్ట్యా నాయక్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో జగదీశ్వర్, సర్పంచ్ శవకూల స్వాతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.