SDPT: సిద్దిపేట మండల కేంద్రంలోని బెజ్జంకి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మాజీ MPTC కొండ్ల వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులందరికీ సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించగా, ఉపాధ్యాయులకు ECG, BP, షుగర్, కంటి పరీక్షలు చేసి తగిన సూచనలతో పాటు అవసరమైన మందులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కొండ్ల విద్యా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ASF: పెంచికల్ పేట్ మండలం గుంట్లపేట గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు మాజీ MLA కోనేరు కోనప్ప శుక్రవారం హాజరయ్యారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీలలో విజేతలకు, రన్నరప్ జట్లకు అయన బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో ముందుకు రావడం ద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని అన్నారు.
PDPL: ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు నంది మేడారం కోర్టు న్యాయవాది ఆకారి రాజేశం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చదువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక సాధనం’ అని పేర్కొన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో రాబోయే పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వార్డు సభ్యులకు రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నామని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఉన్న 160 మంది వార్డు సభ్యులలో 80 మంది చొప్పున శిక్షణ ఇస్తామన్నారు. పట్టణంలోని రైతు వేదికలలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకు, మార్చి 3 నుంచి 8 వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆ శిక్షణకు వార్డు సభ్యులు రావాలని ఆమె కోరారు.
BDK: చుంచుపల్లి మండల కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. విద్యాచందన హాజరై రుణాల 100% రిపేమెంట్, PMKSY పనుల పూర్తి, యూనిఫామ్‌ల తయారీని సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతపై గ్రామస్థాయి బాధ్యత వహించాలని సూచించారు.
KMM: చింతకాని మండలంలో 50% రాయితీపై ట్రాక్టర్లు, రోటవేటర్లు ఇస్తామని నమ్మించి ఓ ముఠా 55 మంది రైతుల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేసింది. కొత్తగూడెం కేంద్రంగా కార్యాలయం తెరిచి, ఫోన్‌పే, బ్యాంకుల ద్వారా నగదు జమ చేయించుకుని పరారైంది. తొలుత కొందరికి తక్కువ ధరకు యంత్రాలిచ్చి నమ్మకం కలిగించి ఈ మోసానికి పాల్పడ్డారు.
JGL: సీఎం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పెగడపల్లి మండల కేంద్రంలోని ZP ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల HM లలిత, ఫిజికల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. 10వ తరగతి చదువుతున్న యోగేశ్ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్‌ను ఎంఈవో, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో త్వరలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు గ్రామాలను ఎంపిక చేయగా అందులో వెంకట్రావుపేట ఒకటి. ఆ గ్రామానికి మొత్తం 1139 సోలార్ యూనిట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. అందులో ప్రస్తుతం 400 సోలార్ యూనిట్లను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో గ్రామంలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది.
JN: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వివిధ గ్రామాలకు నీరు అందించేందుకు గాను కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులను నేడు జనగామ గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు ప్రారంభించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ అన్నారు.
KNR: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక సర్పంచులకు ట్రైనింగ్ జరిగింది. పంచాయతీ రాజ్ చట్టంపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
RR: కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా లే మామిడి గ్రామానికి చెందిన పలువురు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
NGKL: జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారిని అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మిత్రమండలి వెల్దండ ఎస్సై కురుమూర్తికి ఫిర్యాదు చేసింది. అజిలాపూర్ గ్రామానికి చెందిన సిద్దమోని రమేష్ గౌడ్, బుచ్చిబాబులపై చట్టపరమైన చర్యలు కోరారు. మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు మట్ట పరమేష్ గౌడ్, యాదగిరి, శివ, రాజు తదితరులు వినతిపత్రం అందజేశారు.
MDK: రేగోడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న DEO విజయ వెంటనే పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సహకారంతో విద్యార్థులకు తగిన చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
SRD: అనంతారంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
NZB: పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారులదే(DO) ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.