SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో నీటి కష్టాలు అంబరాన్నంటుతున్నాయి. వేసవి వేళ నల్లాలు రాక, వాటర్ హౌస్‌లు ఖాళీ కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
KMR: మద్నూర్ మండలంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యత పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ స్కూల్ మ్యాప్‌ను పరిశీలించారు.
BHNG: రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఎం నాయకుడు బైకాని నరసింహ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ ఇవాళ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయం అందించారు.
NLG: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవ దర్శనంతోనే మానసిక ప్రశాంతత పొందవచ్చని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం మాల్‌గడ్డ ముత్యాలమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
MBNR: ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్స్ సేవలు ఆపద్బాంధవులుగా నిలుస్తున్నాయి. జిల్లాలో 71 అంబులెన్సులు సగటున 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుతున్నాయని ప్రోగ్రామ్ మేనేజర్ రవి తెలిపారు. మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మొత్తం 81,540 మందికి అత్యవసర వైద్య సేవలు అందించామని వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మందిని సకాలంలో చేరుకుని రక్షించగలిగామని పేర్కొన్నారు.
MDK: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా, రైస్ మిల్లర్ అసోసియేషన్ యాజమాన్యాలతో యాసంగి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు.
HYD: రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆవరణలో గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి హత్య..?, ఆత్మహత్య..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేస్తూ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థులు చెక్కపై రూపొందించిన తన చిత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 15 రోజుల్లో 6 బ్యాచ్‌లకు కోర్సులు అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
PDPL: ధర్మారం మండలం నల్లలింగయ్యపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఇద్దరు కాంప్లెక్స్ స్థాయిలో ఎంపికై, అనంతరం ఇంగ్లీష్ విభాగంలో జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ విజయాన్ని అభినందిస్తూ ఎంఈవో పాఠశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీర్పాల్, ఉపాధ్యాయుడు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ రైతు వేదికలో 5 రోజులుగా జరుగుతున్న తొలి విడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 14 గ్రామాలకు చెందిన 122 మంది వార్డు సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, వార్డు సభ్యుల విధులు, తదితర కీలక పరిపాలనా అంశాలపై వీరికి నిపుణులు అవగాహన కల్పించారు.
BDK: న్యాయవాదుల సంక్షేమానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేయాలని న్యాయమూర్తి వసంత్ పాటిల్ కోరారు. భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా జడ్జి వసంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పూల మొక్కలు అందజేసి తమ కమిటీ సభ్యులను పరిచయం చేసుకున్నారు.
SDPT: చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం పద్మారెడ్డి, నాగేందర్, లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను, ఉపాధ్యాయుల మోడల్ లెసన్స్, విద్యార్థుల అభ్యసన స్థాయిని, పాఠశాల రికార్డులు, హాజరు నమోదు, విద్యా ప్రణాళికలను పరిశీలించారు.
VKB: బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామంలోని 1వ వార్డులో ఎంపీ డీకే అరుణ సాకారంతో మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. 4వ వార్డు సభ్యుడు రాజు నాయక్ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ సహకారంతో గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.
JN: అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా 2027 సంవత్సరానికి అగ్నివీర్ పురుష నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వివాహం కాని పురుష అభ్యర్థులు, కనీసం 8వ తరగతి చదివిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. అర్హత గలవారు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MNCL: జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నామని DCP భాస్కర్ శనివారం ప్రకటనలో తెలిపారు. వాహనదారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అతి వేగంగా, మద్యం మత్తులో, నిద్రలేమితో, నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.