JGL: నియోజకవర్గంలో విద్యుత్ షాక్‌తో మరణించిన పశువుల లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం చెక్కులు పంపిణీ చేశారు. బుగ్గారం సెక్షన్ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అనిల్‌కు రూ.40 వేలు, గోపులాపూర్ గ్రామానికి చెందిన విజయకు రూ.40 వేలు, రాయపట్నంకి చెందిన సత్తయ్యకు రూ.40 వేలు, నక్కలపేటలోని గంగవ్వకు రూ.40 వేలు, గంగన్నకు రూ.7 వేల విలువైన చెక్కులను అందజేశారు.
WGL: చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్న ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జల్లి గ్రామానికి చెందిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంతో వారి బంధువులు, గ్రామస్థులు నిర్వహించిన నిరసనలో భాగంగా ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్నమాజీ ఎంపీపీ అశోక్, సర్పంచ్ సుధాకర్ తదితరులపై కేసునమోదు చేశారు.
MDCL: మేడ్చల్ ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ, ఒంగోలు ప్రాంతాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయని డిపో మేనేజర్ పరిమళ తెలిపారు. రోజుకు మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకుని సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చన్నారు. వివరాలకు 9959226152, 9849737131 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
WNP: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా కొత్తకోట మండల పరిధిలో శ్రీ సీతారాముల వారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో సీతారాముల ప్రతిమలను పల్లకిలో ఆశీనులు చేసి ప్రధాన వీధుల్లో ఊరేగించిన పల్లకి సేవ శ్రీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం సాగింది. ‘శ్రీ రామచంద్ర మూర్తికి జై’ అంటూ నినాదాలు చేశారు.
HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలను మరింతగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి ఇటీవల రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు భావితరాలకు నాణ్యమైన విద్య అందించడం, రైతులు, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రయోగశాలలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేశారు.
KMR: జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 525 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించింది. మొత్తం కేసుల్లో 56 మందికి జైలు శిక్షలు పడగా, 40 మందికి ఒక రోజు, నలుగురికి 2 రోజులు విధించారు
SRPT: కోదాడ పరిధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన షేక్ జైనిషా అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. తన యాక్టివా వాహనంపై మేళ్లచెరువు కోదాడ మండలం రామాపురానికి మద్యం తీసుకెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 18 బీర్ బాటిళ్లు, 47 క్వార్టర్ బాటిళ్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
NZB: జిల్లావ్యాప్తంగా నేడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని జిల్లాల న్యాయమూర్తులు తెలిపారు. చిన్న చిన్న కేసులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బును వృథా చేసుకోవద్దనన్నారు.
MDCL: యాసంగి రైతు భరోసా పథకం 2025-26 కింద అర్హులైన రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హులైన అందరికీ రైతుబంధు నిధులు జమ అవుతాయని కీసర మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవిలత వెల్లడించారు.
వనపర్తి మండలం రాజనగరంలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం తాత మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నక్క రాకేష్ (20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాతపై ఉన్న మమకారంతో యువకుడు తనువు చాలించడం గ్రామంలో విషాదం నింపింది.
BDK: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో త్రివేణి – కృష్ణవేణి విద్యాసంస్థలు గత 12 ఏళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తిని తీర్చేందుకు సుమారు 50 వేల మజ్జిగ ప్యాకెట్లు, 50 వేల మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనదారుల ఇబ్బందులకు తెరపడింది. రోడ్డుకు ఇరువైపులా, డివైడర్ల మధ్య అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఈ మొక్కల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
PDPL: శ్రీరాంపూర్ మండలం గంగారం కూరగాయల వారసంతకు ఈనెల 30న ఉదయం 10:30 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి షాహాబుద్దీన్ తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు రూ. 100 డిపాజిట్ చెల్లించాలన్నారు. పాటలో నెగ్గిన వారు అదే రోజు సగం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు పాల్గొనాలని సూచించారు.
KMM: నేలకొండపల్లి వద్ద జాతీయ రహదారిపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్థులు శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
SRPT: నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం (నేడు) ఉపాధి హామీ పనుల (2024-25)పై సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎల్.మన్సూర్ నాయక్ తెలిపారు. జిల్లా అధికారులు పాల్గొనే ఈ బహిరంగ విచారణకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.