NRPT: మద్దూర్ పట్టణ కేంద్రంలోని నాగిరెడ్డి చెరువు కట్టపై శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కోళ్లను తీసుకువచ్చి చెరువు కట్టకు ఇరువైపులా పడవేశారు. బర్డ్ ఫ్లూ వస్తున్న సందర్భంగా ఇప్పటికే ప్రజలు చికెన్ తినడానికి భయపడుతున్నారు. అలాంటిది చనిపోయిన కోళ్లను ఇలా వేయడంపై మద్దూర్ పట్టణ కేంద్రానికి చెందిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
NRML: మండలంలోని చిట్యాల్ వ్యవసాయ బావిలో వన్యప్రాణి చుక్కల దుప్పి పడి బయటకు వెళ్లేందుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా అటు మీదుగా వెళ్తున్న గ్రామస్థులు జైపాల్, నరేందర్ రెడ్డి గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. దుప్పిని బావిలో నుంచి బయటకు తీసి అధికారులకు అప్పగించారు. దుప్పిని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు ఎఫ్తార్ గీతరాణి తెలిపారు.
NZB: రాష్ట్రస్థాయి టైక్వాoడో పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక చేసినట్టు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. నగరంలోని బసవ గార్డెన్‌లో శుక్రవారం ఎంపికలు నిర్వహించారు. HYDలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఎంపిక పోటీలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.
SDPT :కులగణన సర్వేకు నేడు చివరి రోజని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు. కుల, ఆర్థిక, రాజకీయ, సామాజిక సర్వేలో పాల్గొనాలనుకునే వారు వెబ్ సైట్ నుంచి ఫారం డౌన్ లోడ్ చేసుకుని మున్సిపల్ ప్రజాపాలన కౌంటర్లో అందజేయాలని సూచించారు. లేదా నేరుగా ప్రజాపాలన కౌంటర్లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
RR: యాచారం మండల పరిధిలోని గాండ్లగూడెంలో పురుగు మందు తాగి ఆర్టీసీ కండక్టర్ అంజయ్య(40) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో స్థానికులు అతడిని నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పై అధికారుల ఒత్తిడే కారణమని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ADB: నేరడిగొండ మండలంలోని ఇందిరమ్మ కాలనీవాసులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను సబ్లె సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, పలు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు. నాయకులు తిరుపతి, అమర్ సింగ్, రమణ, రాజు తదితరులున్నారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ శుక్రవారం ఉదయం పగిలి నీరు వృధాగా పారుతుంది. కాగా పాత ఉట్నూర్‌లోని మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ ఇంటి సమీపంలో ఉన్న పైప్ పగిలి నీళ్లు రోడ్డుపై వస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్లను బాగు చేసి నీటి వృధాను అడ్డుకోవాలన్నారు.
MBNR: రానున్న 20 రోజులు పదవ తరగతి విద్యార్థులు చదవడం, రాయడం పై దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్యా శాఖ ఆర్జేడి విజయలక్ష్మి అన్నారు. తలుపు తట్టండి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మరికల్ మండలం మాద్వార్ గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి పేరెంట్స్ తో మాట్లాడారు.
HYD: కబేళాలకు తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన గగన్‌పహడ్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. గుర్తుతెలియని వ్యక్తి 16 పశువులను తరలిస్తుండగా స్థానికులు గమనించి వాహనాన్ని అడ్డగించారు. దీంతో డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పశువులను స్వాధీనం చేసుకున్నారు.
RR: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన వీసీల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ హాజరై వారిని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో చేయడం మొదటి సారి అని, 3 యూనివర్సిటీల ఉపకులపతులు ఓకే వేదికపై వచ్చి యూనివర్సిటీల సమస్యలపై వాటి పురోగతికి కృషి చేయడానికి, ఈ వేదిక పునాది అవుతుందన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అప్‌గ్రేడ్ అయింది. ఇప్పటి వరకు 650 పడకలుగా ఉన్న ఆసుపత్రి 900 పడకల కెపాసిటీకి మారింది. ఈ విషయమై జిల్లా డిఎంఈకి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయి. రెండు నెలలలో పడకలను 900కు పెంచేందుకు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
NRPT: కృష్ణ మండలంలో మతిస్థిమితం లేని బాలుడు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. గుడెబల్లూర్‌కి చెందిన నరేష్ (14) మూడు రోజుల క్రితం మతిస్థిమితం లేక కళ్ళు సరిగ్గా కనబడక ఏదో గుర్తు తెలియని పానీయం తీసుకోగా.. అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వనపర్తి: జిల్లా విస్తృత సమావేశం శుక్రవారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన వనపర్తి జిల్లా అమరచింత వాసి కామ్రేడ్ జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు.
మహబూబ్ నగర్: జిల్లాలో రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి. జానకి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చే పండుగలు అన్ని ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ.. పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు.
MBNR: బాలానగర్ మండలం చిన్నరేవల్లి గ్రామంలో పార్వతీ పరమేశ్వర ఉత్సవాల సందర్భంగా కళ్యాణం అనంతరం, రెండో రోజు శకటోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళల తమపై ఉండాలని కోరి, తదనంతరం భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.