MNCL: జైపూర్ మండలం నుంచి కోటపల్లికి ఎండలో ప్రయాణించిన పార్వతి (63) అనే వృద్దురాలు వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ షాహాభాజ్, పైలట్ సిరాజోద్దీన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు బాధితురాలికి ప్రథమ చికిత్స అందిస్తూ చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది.
WNP: పట్టణంలోని 22వ వార్డులో ఉన్న మదరస ఇస్లామియా అన్వరుల్ ఉలూమ్లో పాము కలకలం సృష్టించింది. పాము రావడంతో ముస్లింలు భయాందోళనకు గురయ్యారు. స్పందించిన కొందరు సాగర్ స్నేక్ సొసైటీ సభ్యుడు కృష్ణ సాగర్‌కు తెలపడంతో ఆయన అక్కడ చేరుకొని పామును బంధించి తీసుకెళ్లాడు. కృష్ణ సాగర్ తక్షణమే స్పందించి పామును తీసుకెళ్లినందుకు ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.
ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30, 31 తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ జిల్లా డైరెక్టర్ రమేష్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని సుష్మ ఆస్పత్రిలో మహిళ గర్భాశయంలో ఉన్న రెండు కిలోల బరువైన పైబ్రాడ్ గర్భాశయ కణితి తొలగించారు. దంతాన్ పల్లికి చెందిన లక్ష్మి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ ప్రదీప్ సింహాను సంప్రదించింది. స్కానింగ్‌లో గుర్తించి వైద్యులు హేమరాజ్ సింగ్, శ్రావణ్ కుమార్, తిరుపతి, ప్రదీప్ సింహల బృందం ఆపరేషన్ చేసి తొలగించారు.
KNR: కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన అంతర్గత చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. సుమారు 80 మంది విద్యార్థులు తమ మేధాశక్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీపాల్ రెడ్డి, జీనియస్ చెస్ అకాడమీ కోచ్ అనూప్ కుమార్ మాట్లాడుతూ.. చదరంగంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనాశక్తి పెరుగుతాయని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
GDWL: పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షుడు గడ్డం భరత్ బాబు జోగులాంబ గద్వాల పాత బస్టాండ్ వద్ద ఈనెల 30న బీఆర్ఎస్వీ పోరు దీక్ష విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
MLG: ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమంతో పాటు గిరివాణి(గిరిజన దర్బార్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. గిరిజనులు, గిరిజనేతరులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అర్జీలు సమర్పించాలని సూచించారు.
WGL: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఎంఏ ఇన్ ఇంగ్లిష్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పీహెచ్‌డీకి ఏప్రిల్ 18, ఇతర కోర్సులకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉంది. GATE, NET లేదా ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
KMR: మద్నూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నేటి నుంచి శనగ కొనుగోలు చేయనున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు… ఎకరాకు ఏడు క్వింటాళ్లు. ఒక రైతు 40 క్వింటాళ్లు అమ్మకానికి పరిమితి. పంట 14 శాతం తేమ మించకూడదు. పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఏఈవో దగ్గర ధ్రువీకరణ పత్రంతో పంట అమ్మకానికి తీసుకుని రావాలని సొసైటీ అధికారులు వివరించారు.
SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అనుముల బాలవ్వ అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చికిత్స అందేలా ప్రభుత్వం నుండి రూ.2 లక్షల 50 వేల రూపాయలు వైద్య ఖర్చుల కోసం వెంటనే ఎల్‌వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
WGL: జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. MLS పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం తరలింపు ప్రారంభమైంది. సుమారు 509 షాపులకు సరఫరా జరుగుతోంది. నెలవారీ 5,594.26 మెట్రిక్ టన్నుల బియ్యం స్థానంలో మూడు నెలలకు కలిపి 16,858.94 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,95,442 రేషన్ కార్డులు, 8,92,330 లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
NZB: చిన్నారుల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 3,120 అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలోనే ‘తొలి ముద్ద’ పథకం ద్వారా పౌష్టికహరంతో కూడిన అల్పాహారాన్ని అందించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది.
NGKL: తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ వద్ద వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొన్న ప్రమాదంలో దాసర్ల తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ASF: IPL బెట్టింగ్, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని తిర్యాణి SI వెంకటేష్ సూచించారు. బెట్టింగ్ జోలికి పోయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలన్నారు.