హైదరాబాద్ లో మీరు ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ వెలిగినా కూడా మీ వాహనాలు వైట్ లైన్లను దాటుతున్నాయా.. అయితే మీకు జరిమానా తప్పదు. ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అంతేకాదు వైట్ లైన్ క్రాస్ చేసి ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డుగా ఉన్నా కూడా ఫైన్ విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. రోడ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్ మెంట్ (రోప్) పేరుతో వీటిని అమలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్, ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డుగా ఉంటే రూ.1000 జరిమానా విధించనున్నారు. అంతేకాదు పాదాచారులకు ఇబ్బంది కలిగే విధంగా వాహనాలు పార్క్ చేస్తే రూ.600, దుకాణాదారులు పుట్ పాత్ ఆక్రిమించినా కూడా జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ రూల్స్ కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
వాహనదారులు ఇష్టం వచ్చినట్లు ముందుకు వెళ్లడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు పలువురికి తగిలి యాక్సిడెంట్లు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొంత మంది వైట్ లైన్లు దాటి ముందుకెళ్లడం వల్ల ఆ దిశగా వచ్చే వాహనాలకు ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు.